భారతదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, 2027 నాటికి 2100 మెగావాట్లకు ఇది చేరుకునే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. డిజిటల్ బూమ్, డేటా స్థానికీకరణ ప్రయత్నాల ద్వారా రూ.50వేల కోట్ల నుంచి రూ.55వేల కోట్ల పెట్టుబడుల అంచనాలతో వీటి సామర్థ్యం పెరగనుందని వివరించింది. ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్లు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్లు, ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్లు, సిఫీ టెక్నాలజీస్ వంటి ప్రధాన సంస్థలు 85 శాతం మార్కెట్ ను నియంత్రిస్తున్నాయని.. ప్రస్తుతం మనదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 950 మెగావాట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది.
తక్కువ డేటా టారిఫ్ ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్ల లభ్యత, కొత్త సాంకేతికతల స్వీకరణ, సోషల్ మీడియా, ఇ-కామర్స్, గేమింగ్, ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య ప్రధానంగా టేడా సెంటర్ల పెరుగుదలకు కారణమని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనపమా రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల వచ్చే డిమాండ్ రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో డేటా సెంటర్ల సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లలో 95 శాతం ముంబై, చెన్నై సహా ఆరు నగరాల్లోనే ఉన్నట్టు ఇక్రా నివేదిక వెల్లడించింది. డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా ముంబై విరాజిల్లుతోంది.
కనెక్టివిటీలో ఆ ప్రాంత వ్యూహాత్మక ప్రయోజనాల కారణంగా ప్రస్తుత సామర్థ్యంలో 50 శాతానికి పైగా డేటా సెంటర్లు ముంబైలోనే ఉన్నాయి. అలాగే రాబోయే డేటా సెంటర్ల ఏర్పాటుకు సైతం ముంబై కీలకంగా ఉంటుందని అంచనా. కో లొకేషన్ సేవలకు డిమాండ్ పెరుగుతున్నందున బ్యాంకింగ్, ఐటీ రంగాల నుంచి డేటా సెంటర్ల ఆదాయాలు 2025లో ఏడాదికి 23 నుంచి 25 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది.
This website uses cookies.