రానున్న రోజుల్లో.. అందుబాటు గృహాల విభాగంలో కనీసం .65 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈ విభాగానికి గల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల్ని చేపట్టాల్సిన ఆవశక్యత ఉంది. వాస్తవానికి, మనదేశంలో సుమారు 28 ఏళ్ల వయసు గల యువతీయువకులు గృహరుణాల్ని తీసుకుంటున్నారు. అందుబాటు ధరలకు సంబంధించి హైదరాబాద్‌లో చాలామంది బిల్డర్లకు పెద్దగా స్పష్టత లేనట్లుగా కనిపిస్తోంది. కొందరు బిల్డర్లు రూ. 50 నుంచి 60 లక్షల్లోపు గృహాలు అందుబాటు గృహాల పరిధిలోకి వస్తాయంటే.. మరికొందరు రూ.75 లక్షల గృహాలు ఈ విభాగంలోకి వస్తాయని అంటున్నారు. కాకపోతే, ఈ రేటుకు హైదరాబాద్‌లో ఎక్కడ ఫ్లాట్లు దొరకుతున్నాయంటే.. ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైనా బిల్డర్లు తమ ఆలోచనా విధానం మార్చుకుని.. అందుబాటు గృహాల్ని నిర్మించాల్సిన ఆవశక్యత ఎంతైనా ఉంది.
హైదరాబాద్‌లో అధిక శాతం డెవలపర్లు డబుల్ బెడ్‌రూం అంటే 1200 నుంచి 1400 చదరపు అడుగుల్లో కడుతున్నారు. అదే పదేళ్ల క్రితమైతే 900 నుంచి 1000 చదరపు అడుగుల్లో కట్టేవారు. ఒకవైపు భూముల ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో, డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొనాలన్నా కోటీ రూపాయలకు పైగా పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో, చాలామంది ఎగువ మధ్యతరగతి ప్రజలూ సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్పడుతోంది. అందుకే, బిల్డర్లు కనీసం ఇప్పటికైనా తమ తమ ఆలోచనా విధానం మార్చుకోవాలి. మళ్లీ పాత పద్ధతిలోకి వెళితే తప్ప, అందుబాటు గృహాలు కట్టలేరు. 900 నుంచి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్‌రూముల్ని కడితే మధ్యతరగతి ప్రజానీకం కొనేందుకు ముందుకొస్తారు. అంతేతప్ప, చిన్న ఫ్లాట్లు అయితే కాలమ్‌లు, బీమ్‌లు ఎక్కువగా వేయాలి.. ఎక్కువ మంది బయ్యర్లతో డీల్ చేయాలని ఆలోచించుకుంటూ కూర్చుంటే.. ఈ రంగం నుంచి నిష్క్రమించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, డెవలపర్ల ఆలోచనలు మారాలి. అందుబాటు గృహాల్ని నిర్మించేందుకు ప్రాధాన్యతనివ్వాలి.
This website uses cookies.