Categories: LATEST UPDATES

నిర్మాణాలు నిలిపేద్దాం

  • ధరల పెరుగుదల నేపథ్యంలో డెవలపర్ల యోచన

సిమెంట్, స్టీల్ సహా నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటిని కొనుగోలు చేయడం ఆపేసి కొంతకాలంపాటు నిర్మాణాలు నిలిపివేయాలని మహారాష్ట్ర డెవలపర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనీసం ఆరు నెలల గడువు పొడిగించాలని మహా రెరాకు విన్నవించారు. ‘గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడవి ఆకాశన్నంటుతున్నాయి. ఇది చాలామంది డెవలపర్లకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఈ నేపథ్యంలో క్రెడాయ్ మహారాష్ట్రలో సభ్యత్వం కలిగిన 61 మంది సిటీ అసోసియేషన్ సభ్యులకు తాత్కాలికంగా తమ నిర్మాణాలను నిలిపివేయడం తప్ప మరో మార్గం కనిపించడంలేదు’ అని క్రెడాయ్ మహారాష్ట్ర అధ్యక్షుడు సునీల్ ఫుర్దే చెప్పారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుదల వల్ల ప్రాజెక్టు వ్యయం 40 నుంచి 45 శాతం మేర పెరిగిందని.. ఫలితంగా చదరపు అడుగు ధర రూ.400 నుంచి రూ.600 అధికంగా వ్యయం అవుతోందని వివరించారు. ప్రస్తుతం మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల ప్రాజెక్టుల పనులు జరుగుతుండగా.. దాదాపు పది లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలలపాటు నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోతే వారందరిపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

This website uses cookies.