Categories: EXCLUSIVE INTERVIEWS

కృత్రిమంగా పెరిగే ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వ‌మే నియంత్రించాలి!

  • రియల్ ఎస్టేట్ గురుతో క్రెడాయ్ హైదరాబాద్
    అధ్యక్షుడు రామ‌కృష్ణారావు

సిమెంట్, స్టీల్ సహా నిర్మాణ రంగానికి అవసరమైన సామగ్రి ధరల పెంపు అంతా కృత్రిమమేనని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామ‌కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నిర్మాణ‌ సామగ్రి ధరలు ఆకాశన్నంటడంతో దేశవ్యాప్తంగా బిల్డర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మెటీరియల్స్ రేట్లు ఎంత శాతం పెరిగాయి.. పెర‌గ‌డానికి కార‌ణాలేమిటి.. త‌దిత‌ర‌ అంశాలపై రియల్ ఎస్టేట్ గురు రామ‌కృష్ణారావుని ప్ర‌త్యేక ఇంటర్వ్యూ చేసింది. సారాంశం ఆయన మాటల్లోనే..

‘వాస్తవానికి గతేడాదే భ‌వ‌న నిర్మాణ సామ‌గ్రి రేట్లు దాదాపు ముప్ప‌య్ శాతం పెరిగాయి. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా మరో 20 శాతం వ‌ర‌కూ రెట్టింపైంది. అయితే, ఇదంతా కృత్రిమ పెంపే. 14 బిలియన్ డాలర్ల విలువైన సామగ్రి ఎగుమతి చేశామని కేంద్రం చెబుతోంది. ఇందులో స్టీల్ ఒక్కటే 20,870 మిలియన్ టన్నులు ఉంది. నిజానికి సంక్షోభం ఉన్నప్పుడు ఎగుమతులు తగ్గించాలి కదా? ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటేనేమో.. వాటి రేట్లు పెరిగాయని అనుకోవచ్చు. కానీ ఆయిల్ తప్ప మనం వీటిని దిగుమతి చేసుకోవట్లేదు. అయినా సరే యుద్ధం బూచి చూపించి సందట్లో సడేమియా అన్నట్టుగా వీటి రేట్లు విపరీతంగా పెంచేశారు.

నిజానికి ఉత్పాదక వ్యయం పెరగలేదు. మ్యాన్ పవర్ పెరగలేదు. బొగ్గు ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. ఐరన్ ఓర్ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. విద్యుత్ కూడా మనమే త‌యారు చేసుకుంటున్నాం. లేబర్ వ్యయం కూడా అధికం కాలేదు. అయినా ఆయిల్ పెరుగుదల అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ పెరిగినా కూడా.. రూ.60 వేలు ఉన్న స్టీల్.. రెండు రోజుల్లోనే రూ.80వేలు కాదు కదా? అందువల్ల ఇదంతా కృత్రిమ పెంపేనని చెప్పక తప్పదు.
స్టీల్, సిమెంట్ ఒక్కటే కాకుండా మిగిలిన సామగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ కారణంగా క్రెడాయ్ మహారాష్ట్ర వాళ్లు నిర్మాణాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారని విన్నాను. ఈ నేపథ్యంలో ఇక్కడ మనమే చేయాలనే దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వారం పది రోజుల్లోనే స్టీల్ రూ.60వేల నుంచి రూ.85వేలకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఎగుమతులు నిలిపి వేస్తే రేట్లు అదుపులోకి వస్తాయి’ అని ఆర్.కె.రావు వివరించారు.

This website uses cookies.