మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన విషయంలో కొనుగోలుదారులకు చెప్పిందంతా బిల్డర్లు చేయాల్సిందేనని, ఆ బాధ్యతల నుంచి వారు తప్పించుకోజాలరని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నప్పుడు దాని నిర్వహణను రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్ డబ్ల్యూఏ)లకు అప్పగించి వెళ్లిపోవడం సరికాదని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో ఆర్ డబ్ల్యూఏలకు పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు 18 ఏళ్లనాటి ఓ కేసులో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. వాటర్ ప్లాంట్, రెండో హెల్త్ క్లబ్, స్విమ్మింగ్ పూల్, అగ్నిమాపక నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేయనందుకు రాయల్ గార్డెన్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు రూ.60 లక్షలు చెల్లించాలని పద్మినీ ఇన్ ఫ్రాస్టక్చర్ కంపెనీని ఆదేశించింది.
నోయిడాలో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ 282 ఫ్లాట్లతో ఓ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టింది. 1998 నుంచి 2001 మధ్య వాటిని కొనుగోలుదారులకు అప్పగించింది. అనంతరం కొనుగోలుదారులు 2003లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పరుచుకున్నారు. 2003 నవంబర్ లో అపార్ట్ మెంట్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్వహణ నిమిత్తం బిల్డర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఒప్పందం ప్రకారం బిల్డర్ చేయాల్సిన పనులు చేయకపోవడంతో అసోసియేషన్.. వినియోగదారుల ఫిర్యాదు పరిష్కారాల జాతీయ కమిషన్ ను ఆశ్రయించింది. విచారణ జరిపిన కమిషన్.. అసోసియేషన్ కు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. దీంతో కంపెనీ 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించి కమిషన్ ఉత్తర్వులపై స్టే పొందింది. అయితే, రిజిస్ట్రీలో రూ.60 లక్షలు డిపాజిట్ చేయాలని కంపెనీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా దశాబ్దం తర్వాత ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. రిజిస్ట్రీలో డిపాజిట్ చేసిన రూ.60 లక్షలను అసోసియేషన్ కు అందజేయాలని పేర్కొంది. ఈ విషయంలో కంపెనీ వాదనను తోసిపుచ్చింది.
అపార్ట్ మెంట్ నిర్వహణను 18 ఏళ్ల క్రితం ఆ కంపెనీకి అసోసియేషన్ అప్పగించిందని, ఈ నేపథ్యంలో ఆ సౌకర్యాలను ఇప్పుడు కల్పించాలని బిల్డర్ పై ఒత్తిడి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదే సమయలో ఫిర్యాదుదారుడు పరిహారం పొందాల్సిందేనని.. రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ గా ఉన్న రూ.60 లక్షలను వడ్డీతో కలిపి ఫిర్యాదుదారుడికి చెల్లించాలని సూచించింది. అలాగే క్లబ్ హౌస్ లోఉన్న బిల్డింగ్ మెటీరియల్ ను రెండు వారాల్లోగా ఖాళీ చేసి ఫిర్యాదుదారుడికి అప్పగించాలని బిల్డర్ ను ఆదేశించింది.
This website uses cookies.