కరోనా తర్వాత భారత రియల్ రంగం బాగానే పుంజుకుంది. అలాగే హైదరాబాద్ మార్కెట్ కూడా చక్కగానే ముందుకెళ్లింది. అయితే, గత కొంతకాలంగా ఈ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. రియల్ మార్కెట్ ఆశించినంత ముందుకు వెళ్లలేదు. ఈ పరిస్థితికి ప్రధానంగా ఆరు కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందులో మొదటిది ధరల పెరుగుదల. హైదరాబాద్ లో ప్రాపర్టీ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. ఫలితంగా కొనుగోళ్లు మందగించాయి. ఇక రెండోది.. ప్రతికూల ప్రచారం. ఇటీవల ఒకటి రెండు మీడియా ఛానళ్లలో హైదరాబాద్ రియల్ మార్కెట్ గురించి విపరీతమైన ప్రతికూల ప్రచారం సాగింది. అసలు హైదరాబాద్ రియల్ మార్కెట్లో ఏదో జరిగిపోయింది అనేలా ఆ ప్రచారం సాగడంతో కొనుగోలుదారులు కన్ఫ్యూజన్ లో పడిపోయారు.
111 జీవోను తీసేయడంతో హైదరాబాద్ ఐటీ ప్రాంతానికి చాలా దగ్గర్లో పెద్ద మొత్తంలో భూమి అందుబాటులోకి వస్తుందని.. పైగా ధరలు కూడా అందుబాటులో ఉంటాయని భావించి చాలామంది ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టలేదు.
నాలుగో కారణం.. రాజకీయ పరిస్థితులు. గత ఆరు నెలలుగ హైదరాబాద్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా రియల్ పై ప్రభావం చూపించాయి.
ఇక ఐదో అంశం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో అనే ఆందోళన చాలామందిలో నెలకొంది. ఈ యుద్ధం నేపథ్యంలో నిర్మాణ మెటీరియల్ సరఫరా ఇతరత్రా అంశాలు ప్రభావితమవుతాయనే భావనతో కొందరు కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు.
చివరి కారణం.. మాంద్యం. గతంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు పడిన ఇబ్బందులు అందరికీ గుర్తుండటంతో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందనే భయంతో చాలామంది పెట్టబడులకు ముందుకు రాలేదు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ప్రతికూలతలేనని.. కొంతకాలం తర్వాత ఇవన్నీ సద్దుమణుగుతాయని.. అందువల్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రాపర్టీ ధరల పెరుగుదల మాత్రం కచ్చితంగా రియల్ భూమ్ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.