Categories: LATEST UPDATES

రాంకీ కేసులో రైతులకు ఊరట

  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు
    ద్విసభ్య ధర్మాసనం స్టే
  • రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశం

రాంకీ కేసులో రైతులకు ఊరట లభించింది. రిజిస్ట్రేషన్లు కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని శ్రీనగర్ గ్రామంలో రాంకీ సంస్థ, హెచ్ఎండీఏ కలిసి మూడు దశల్లో 750 ఎకరాలను టౌన్ షిప్ గా అభివృద్ధి చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. డిస్కవరీ సిటీగా నామకరణం చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. మొదటి దశలోని 400 ఎకరాల్లో 375 ఎకరాలకు సంబంధించి ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లపై పట్టాలున్నాయి. తొలుత దీని కోసం ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు రాంకీ, హెచ్‌ఎండీఏ మధ్య ఒప్పందం తరువాత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. కాగా, ఒప్పందంలో భాగంగా రాంకీ సంస్థ రూ.100 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. తొలుత రూ.25 కోట్లు చెల్లించింది. మరో రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ముందు 100 ఎకరాల్లో చేపట్టిన విల్లాలను, ప్లాట్లను అమ్మేందుకు రాంకీ ప్రయత్నించింది. అయితే ఒప్పందంలోని నిబంధనలు పాటించలేదన్న కారణంతో హెచ్‌ఎండీఏ ఆ రిజిస్ట్రేషన్లను ఆపేసింది. దీంతో హెచ్‌ఎండీఏ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాంకీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మీర్‌పేటకు చెందిన పాలూరి రవిశంకర్‌తో పాటు మరొకరు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్టే విధించింది. హెచ్ఎండీఏ, రెవెన్యూ విభాగం, మున్సిపల్ శాఖ తదితరలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.

This website uses cookies.