గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించడం లేదా నిలిపి ఉంచుకోవడం అనేది మీరు ఎంచుకున్న పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో రుణగ్రహీతలు అసలు, వడ్డీ చెల్లింపులు రెండింటిపైనా తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80సి అసలు చెల్లింపుపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపును అనుమతిస్తుంది. అయితే సెక్షన్ 24(బి) చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు తగ్గింపును అనుమతిస్తుంది. రుణగ్రహీత అత్యధిక పన్ను పరిధిలోకి వచ్చి పూర్తి మినహాయింపు పరిమితిని ఉపయోగిస్తుంటే, పన్ను ఆదా గణనీయంగా ఉంటుంది.
ఉదాహరణకు, ఎవరైనా గృహ రుణ వడ్డీని సంవత్సరానికి రూ.2 లక్షలు చెల్లించి 31.2% (సెస్‌తో సహా) పన్ను పరిధిలోకి వస్తే, ప్రభావవంతమైన పన్ను ఆదా రూ.62,400 అవుతుంది. అయితే, రుణగ్రహీత తగ్గింపులను పూర్తిగా ఉపయోగించుకోకపోతే లేదా తక్కువ పన్ను పరిధిలోకి వస్తే ముందస్తు చెల్లింపు ఆర్థికంగా మంచి చర్య అవుతుంది. కొత్త పన్ను విధానంలో ఈ తగ్గింపులు అందుబాటులో లేవు. అలాంటి సందర్భాలలో రుణాన్ని ముందస్తుగా చెల్లించడం మరింత ఆకర్షణీయమైన ఎంపిక అవుతుంది. మీరు ఒకేసారి లేదా అదనపు డబ్బును అందుకుంటే దాన్ని మీ గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించడానికి ఉపయోగించాలని.. ఆపై ఆదా చేసిన ఈఎంఐలను సిప్ లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అటు రుణ బాధ్యతలు తగ్గించుకోవడంతోపాటు ఇటు కాలక్రమేణా సంపదను పెంచుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.