- దూసుకెళ్లనున్న భారత రియల్ రంగం
- సిరిల్ నివేదిక అంచనా
ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, భారత రియల్ ఎస్టేట్ రంగం జోరు ప్రదర్శిస్తుందని.. మరో ఐదేళ్లలో రూ.90 లక్షల కోట్లకు ఇది చేరుకుంటుందని సిరిల్ నివేదిక అంచనా వేసింది. 2021లో రూ.18 లక్షల కోట్లతో ఉన్న మన రియల్ రంగం.. ఐదేళ్లలో ఏకంగా రూ.90 లక్షల కోట్లకు చేరుకోవడం ఖాయమని పేర్కొంది. ప్రస్తుతం దేశ జీడీపీలో రియల్ వాటా 13 శాతంగా ఉందని వివరించింది.
రిటైల్, ఆతిథ్యం, కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగాలు క్రమంగా వృద్ధి బాటలో సాగుతున్నాయని తెలిపింది. అలాగే 2047 నాటికి భారత రియల్ రంగం 5.8 ట్రిలియన్ (5.8 లక్షల కోట్లు) డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అప్పుడు దేశ జీడీపీలో రియల్ వాటా 15.5 శాతానికి పెరుగుతుందని వివరించింది. ఇక గత ఏడాది రియల్ రంగాన్ని పరిశీలిస్తే.. చక్కని పనితీరు కనబరిచిందని తెలిపింది. ఆఫీస్ రంగం రారాజుగా కొనసాగిందని.. మొత్తం పెట్టుబడుల్లో 60 శాతం వాటా ఈ విభాగానిదేనని నివేదిక వెల్లడించింది. 2025 నాటికి భారత్ లో వేర్ హౌసింగ్ సరఫరా 300 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని పేర్కొంది. గత ఐదేళ్లలో దేశంలోని ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గ్రేడ్-ఎ వేర్ హౌసింగ్ స్టాక్ 21 సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెంది 2024 నాటికి 183 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. 2025లో ఇది మరో 19 నుంచి 20 శాతం మేర పెరగనుంది. అలాగే 2025లో గ్రేడ్ ఏ సరఫఱా అదనంగా 35 మిలియన్ చదరపు అడుగులు పెరిగే అవకాశం ఉంది. రిటైల్ సెక్టార్ విషయానికి వస్తే.. గతేడాది 13.5 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. తద్వారా రిటైల్ మార్కెట్లకు సంబంధించి 2024 అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ లో గ్రేటర్ హైదరాబాద్ భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. కమర్షియల్ లీజింగ్ కార్యకలాపాల్లో 12.5 మిలియన్ చదపు అడుగులతో మంచి పనితీరు కనబరిచింది.