(కింగ్ జాన్సన్ కొయ్యడ)
మా ప్రాజెక్టు నుంచి హైటెక్ సిటీ కేవలం 15 కిలోమీటర్లే..
బాచుపల్లి వెరీ హాట్ లొకేషన్.. మాదాపూర్ ఎంతో దగ్గర!
బాచుపల్లి హాట్ లొకేషన్ అని.. ఇక్కడ్నుంచి మియపూర్ మెట్రో స్టేషన్ చేరువ అని.. కొన్ని నిర్మాణ సంస్థలు ఊదరగొడుతున్న ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. ఎందుకంటే, బాచుపల్లి నుంచి హైటెక్ సిటీకి.. అటు నిజాంపేట్, ప్రగతినగర్ మీదుగా వెళ్లినా.. ఇటు మియాపూర్ నుంచి వెళ్లినా.. 15 నుంచి 18 కిలోమీటర్ల దాకా ఉంటుంది. బాచుపల్లి నుంచి మియాపూర్ మీదుగా వెళ్లేవారికి ఐడీఏ బొల్లారం, ఆర్టీసీ బస్ బాడీ యూనిట్, డీమార్టుల వద్ద ట్రాఫిక్ రద్దీ నిత్యకృత్యమైంది. ఈ రహదారి మీద నిర్మితమవుతున్న నిర్మాణ ప్రాజెక్టుల టిప్పర్లు ఉదయం నుంచి రాత్రివరకూ పట్టాపగ్గాల్లేకుండా తిరగడమో ప్రధాన కారణమని చెప్పొచ్చు. పైగా, ఈ రహదారిని వెడల్పు చేస్తామని ఎప్పట్నుంచో అధికారులు ఊదరగొడుతున్నారు. కానీ, ఇంతవరకూ పనిని ప్రారంభించిన దాఖలాల్లేవు. ఇక నిజాంపేట్ మీదుగా వెళ్లి జేఎన్‌టీయూ దాటి మంజీరా మాల్ వద్ద ఫ్లైఓవర్ ఎక్కాలంటే ప్రతిరోజు సర్కస్ ఫీట్ చేయాల్సిందే.
బాచుపల్లి పక్కన ఉండే పారిశ్రామిక వాడల నుంచి రసాయన కాలుష్యాల విడుదల సర్వసాధారణంగా మారింది. సాయంత్రమైతే చాలు.. తలుపులు బిగించుకోవాల్సిందే. ఇప్పటికే బాచుపల్లి, మల్లంపేట్‌లో నివసించేవారికిది సర్వసాధారణంగా మారింది. కాకపోతే, కొత్త వారికి కొంత ఇబ్బందిగా మారే ప్రమాదముంది. కాలుష్య పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు దాటి వెళిపోతాయని ఫ్లాట్లు కొనేటప్పుడు రియల్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు ఎంతో వినయంగా చెబుతుంటారు. కాకపోతే, ఆ నిర్మాణం పూర్తయ్యి.. అందులోకి అడుగు పెట్టాక కానీ అసలు విషయం తెలుస్తుంది.
ఎందుకంటే, ఈ రసాయన కాలుష్యమనమేది సర్వసాధారణంగా మారింది. ఏయే సంస్థలు వీటిని గాల్లోకి వదులుతాయనే విషయం ప్రతిఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ, అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కానీ పెద్దగా పట్టించుకోరు. వారిని మనం గట్టిగా నిలదీస్తే.. పరిశ్రమల పక్కన వచ్చి ఎవరు ఫ్లాట్లు కొనమన్నారు? అని మన మీదే దాడికి దిగుతారు. కాబట్టి, పరిశ్రమలు తరలిపోతాయనే విషయాన్ని ఎవరూ పక్కాగా చెప్పలేరని గుర్తుంచుకోండి. ఫ్లాట్ కొన్నాక.. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు.. ఈ ఫ్లాటును ఎవరికైనా అద్దెకివ్వాలన్నా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.
2018-19 వరకూ బాచుపల్లిలో చదరపు అడుక్కీ ఫ్లాట్ ధర రూ.3,000 లోపే ఉండేది. కానీ, కొన్ని సంస్థల అబద్దపు ప్రచారం వల్ల ప్రస్తుతం రూ.5,500కు చేరింది. గత ఐదేళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా చెప్పుకోదగ్గ లేదు. అప్పట్నుంచి అదే ట్రాఫిక్ గోల.. ప్రస్తుతం మరింత పెరిగిపోయింది. మల్లంపేట్, బాచుపల్లి రోడ్లను చూస్తే ఎవరికైనా జాలి వేయాల్సిందే. ఎక్కడపడితే అక్కడ గోతులు ఏర్పడి.. నీళ్లు నిండిపోయి.. చిందరవందరగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని కొన్ని రహదారులు తళతళ మెరుస్తుంటే.. ఇక్కడ మాత్రం అష్టదరిద్రంగా మారాయి. కేవలం మియాపూర్ మెట్రో ఆరంభమైన తర్వాత.. మియాపూర్, బాచుపల్లి గురించి కొన్ని సంస్థలు చేసిన అబద్దపు ప్రచారం వల్ల.. కృత్రిమంగా భూముల ధరలు పెరిగాయి. దాన్ని ఆధారంగా బిల్డర్లూ ఫ్లాట్ల రేట్లను పెంచేశారు.
ఒకప్పుడు బాచుపల్లి శివారు ప్రాంతం కావడం.. స్థలాల ధరలు తక్కువగా ఉండటం వల్ల.. పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు. ఇంజినీరింగ్ కాలేజీలు ఆరంభమయ్యాయి. అయితే, వీటిలో చదివే స్కూళ్లు విద్యార్థులు ఏదో ఒక సందర్భంలో రసాయన కాలుష్యాల్ని పీలుస్తూనే ఉంటారు. కాకపోతే, కొన్నాళ్ల తర్వాత ఆయా చిన్నారుల శరీరం ఆ కాలుష్యానికి అలవాటు పడిపోయే అవకాశముందని సమాచారం. ఈ విషయం తెలిసి పలు స్కూళ్లు యాజమాన్యాలు పీసీబీకి ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదని తెలిసింది. గ్రామ పంచాయతీల అనుమతి తీసుకుని కట్టిన స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. కాకపోతే, అందులో కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందుకే, బాచుపల్లి నుంచి మల్లంపేట్, దాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాట్లను కొనేవారు తగ్గిపోయారు.
బాచుపల్లిలో వచ్చే రెండు, మూడేళ్లలో ఫ్లాట్ల ధరలు పెరుగుతాయి. కాబట్టి, నేడే ఇల్లు కొనుక్కోండని ఎవరైనా చెబితే నమ్మకండి. ఎందుకంటే ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో.. మొత్తం కలిపి సుమారు నాలుగు నుంచి ఐదు వేల ఫ్లాట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. కొందరు బిల్డర్లు అత్యాశతో ఎక్కడ పడితే అక్కడ అపార్టుమెంట్లను ఆరంభించారు. ఫ్లాట్ల సరఫరా పెరగడంతో గిరాకీ తగ్గుముఖం పట్టింది. దీంతో, కొందరు బిల్డర్లు పోటీ పడి రేట్లను తగ్గిస్తున్నారు. కాబట్టి, సరైన బిల్డర్‌ను ఎంచుకోవాలంటే.. కొనుగోలుదారులు ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది.
This website uses cookies.