ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే చాలామంది వెళ్తుంటారు. ఇక ప్రస్తుతం ఫర్నిచర్ కు సంబంధించిన కొత్త ట్రెండ్ బాగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇంటీరియర్ విషయంలో ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఉంటూనే పర్యావరణానికి హాని చేయకుండా ఎలాంటి ఫర్నిచర్ వినియోగించాలనే అంశంపై బోలెడు ఐడియాలు వస్తున్నాయి. ప్రతి మెటీరియల్ సహజసిద్ధంగా ఉండేది ఎంపిక చేసుకుంటే అవి పది కాలాలపాటు మన్నికగా ఉండటమే కాకుండా ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం. ప్రస్తుతం రంగులు కూడా పర్యావరణ అనుకూలమైనవి వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త ఫర్నిచర్ ఎలా ఉండాలో ఓసారి చూద్దామా?
ఓల్డ్ ఈజ్ గోల్డ్. వింటేజ్ వస్తువులకు విలువ చాలా ఎక్కువ. మీ ఇంట్లో పాత ఫర్నిచర్ ఉంటే దానికే కొత్తగా సొబగులు అద్దితే సరి. అటు సొమ్ము ఆదా అవడమే కాకుండా ఇటు మీ గదికి కొత్త లుక్ కూడా వస్తుంది.
వింటేజ్ తోపాటై రెట్రో స్టైల్ కూడా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులోని రంగులు, ప్యాటర్న్, డిజైన్లు ఫర్నిచర్ కు , ఇంటికి, అలంకరణ వస్తువులకు సరికొత్త లుక్ తీసుకొస్తాయి.
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం బాగా పెరిగి, ప్రతి ఇంట్లో ఓ ఆఫీసు గది ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్న చిన్న స్థలాన్ని సైతం ఆకర్షణీయంగా మార్చుకుని వినియోగించుకోవాలి. కళ్లకు అందంగా కనిపించేలా నేచురల్ ఫర్నిచర్ ఏర్పాటు చేసుకుని, ప్రశాంత వాతావరణం ఉండేలా అక్కడి పరిస్థితులు తీర్చిదిద్దుకోవాలి. ఆహ్లాదకరమైన రంగులు వేయించడం ద్వారా ప్రశాంతమైన మనసుతో పని చేసుకోవచ్చు.
గాలీ వెలుతురూ సహజసిద్ధంగా ఉండేలా చేసుకోవడం మరో అంశం. మనం పనిచేసే చోటుకు సాధ్యమైనంత సహజ సిద్ధ కాంతి వచ్చేలా చూసుకోవాలి. పెద్ద కిటికీలు ఏర్పాటు చేసుకోవడం, సీలింగ్ ఎత్తుగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యలతో వెలుతురు బాగా వచ్చేలా చేసుకోవచ్చు. గాలీ వెలుతురూ బాగా వస్తే.. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలతో పని ఉండదు. అంటే ఆ విధంగా పర్యావరణానికి మేలు చేస్తున్నట్టే.