అక్రమ వెంచర్లు, ప్రాజెక్టులపై చర్యల్ని తీసుకోవాలని కొంతకాలం నుంచి రెజ్ న్యూస్ కథనాల్ని ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెజ్ న్యూస్ కథనాలపై తెలంగాణ రెరా అథారిటీ స్పందించింది. రాష్ట్రంలోని అక్రమ వెంచర్లపై చర్యలకు ఉపక్రమించింది. రెరా అనుమతి లేని వెంచర్లు, ప్రాజెక్టుల వివరాల్ని ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రచురించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పలు వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేయకూడదని రెరా తాజాగా హెచ్చరించింది. ఇన్వెస్ట్ ఇన్ ఎకర్స్ అండ్ బెనిఫిట్ ఇన్ స్వ్కేర్ యార్డ్స్ అంటూ స్వ్కేర్ యార్డ్ ఫ్యాక్టరీ అనే రియల్ సంస్థ అక్రమంగా ప్లాట్లను విక్రయిస్తుందని గుర్తించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాల్ని సేకరించింది. ఇందులో కొనుగోలుదారులు ప్లాట్లను కొనకూడదని హెచ్చరించింది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధుల నెంబర్ల (8074926830, 9848188856)ను రెరా వెల్లడించింది. వీరి వద్ద ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోకూడదని హెచ్చరించింది.
చేవేళ్లలో 12 ఎకరాల్లో గోల్డన్ పామ్స్ ఎన్‌క్లేవ్, గ్రీన్ స్క్వేర్, కిస్టాపూర్ లో 10.5 ఎకరాల్లో ప్రైమ్ ఎవెన్యూ, రాకంచర్లలో 11.5 ఎకరాల్లో మెజెస్టిక్ విల్లాస్, రాకంచర్లలో 3.5 ఎకరాల్లో స్టార్ కాలనీ వంటి వెంచర్లకు స్థానిక సంస్థల నుంచి.. రెరా చట్టం 2016 సెక్షన్ 3(1), 4 (1) ప్రకారం.. ఎలాంటి అనుమతుల్లేవని రెరా అథారిటీ తెలియజేసింది. రెరా చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం.. రెరా అనుమతి లేకుండా ఎలాంటి ప్లాటు కానీ ఫ్లాటు కానీ విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఇక నుంచి రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు విక్రయించకూడదని.. అలా అమ్మే వాటిలో కొనుగోలు చేయకూడదని తెలియజేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల్లో కొనుగోలు చేసేవారు.. వాటికి రెరా అనుమతి ఉందా? లేదా? అనే విషయాన్ని రెరా వెబ్‌సైటులో తెలుసుకున్నాకే ముందడుగు వేయాలని సూచించింది. ఇందుకోసం రెరా వెబ్‌సైటు ((https://rerait.telangana.gov.in /SearchList /Search)ను చూడాలని కోరింది.