రెజ్ న్యూస్, హైదరాబాద్ : రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు సంబంధించిన టవర్లు అమ్మకాల కోసం సోమవారం జరిగిన ప్రి బిడ్ సమావేశంలో యాభై మందికి పైగా బిల్డర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్ ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. అవి ప్రస్తుతం ఎలా ఉన్నాయో అలాగే వాటిని అమ్మేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. పోచారంలో 9 అంతస్తుల నాలుగు (4) టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్ లో కనీసం 72 నుంచి 198 ప్లాట్లను నిర్మించొచ్చు. అదేవిధంగా గాజులరామారంలో 14 అంతస్తుల ఐదు (5) టవర్లు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క టవర్‌లో 112 ఫ్లాట్లను నిర్మించొచ్చు.
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న పోచారం, గాజుల రామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి బిల్డర్లు, డెవలపర్లు, పలు ఎంప్లాయిస్ సొసైటీలు ఆసక్తిని కనబరిచాయి. తుది చెల్లింపుల గడువు పెంచాలని, సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూనే.. జీఎస్టీ భారం లేకుండా చూడాలని వీరు కోరారు. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాజీవ్ స్వగృహ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య తెలిపారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య ఆధ్వర్యం లో జరిగిన ఈ ప్రీ బిడ్ సమావేశానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) సెక్రెటరీ పి. చంద్రయ్య, హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి లతో పాటు గృహ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
This website uses cookies.