కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవో మీద వ్యతిరేకంగా ఉంది. అయినా, గత ప్రభుత్వ హయంలో.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో.. కొందరు బిల్డర్లు అక్రమంగా విల్లాల్ని నిర్మించారు. మీరెంతో ముచ్చటపడి అజీజ్‌నగర్ వంటి ఏరియాలో కొన్న అతిపెద్ద విల్లాల్ని హెచ్ఎండీఏ ఒక్కసారిగా నేలమట్టం చేస్తే ఎలా?
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని కూడా ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. అలాంటప్పుడు, ట్రిపుల్ వన్ జీవోలో.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అక్రమంగా విల్లాలు కొన్నా.. ప్రస్తుత ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నా.. వారిని ప్రభుత్వం వదిలివేస్తుందని అనుకుంటున్నారా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో అక్కడక్కడా ఫామ్ హౌజులుండేవి. వేళ్ల మీద లెక్కపెట్టేనన్నీ విల్లా కమ్యూనిటీలుండేవి. అక్కడక్కడా విసిరేసినట్లు కొన్ని రిసార్టులుండేవి. కానీ, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.. ట్రిపుల్ జీవోను ఎత్తివేస్తామన్న మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ పుణ్యమా అంటూ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో.. అక్రమంగా విల్లాల్ని నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరిగింది. శాశ్వత నిర్మాణాల్ని నిషేధించిన ఈ ప్రాంతంలో.. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న నిర్మాణాల నుంచి విడుదలయ్యే మురుగునీరంతా జంటజలాశయాల్లోకి వదిలిపెడుతున్నారు. ఇదే కొనసాగితే కొన్నాళ్ల తర్వాత.. అవి కాస్త కాలుష్య కాసారాలుగా మిగిలిపోతాయి.
ట్రిపుల్ వన్ జీవోలో మొత్తం 84 గ్రామాల్ని ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి తెచ్చారు. అయితే, అందులో మొయినాబాద్, అజీజ్‌నగర్, బాకారం వంటి ప్రాంతాల్లో అక్రమంగా విల్లాల్ని కట్టడం గత ప్రభుత్వంలో ఆనవాయితీగా మారింది. ఈ అక్రమ బిల్డర్లు ఏదో రకంగా హెచ్ఎండీఏను మేనేజ్ చేసి.. ఇష్టారాజ్యంగా విల్లాల్ని నిర్మిస్తున్నారు. తామేం చేసినా చెల్లుతుందనే ధోరణీలో అధికారులూ వ్యవహరించేవారు. తామేం చెప్పినా ప్రభుత్వం వింటుందనే ఉద్దేశ్యంతో.. ఎన్ని అక్రమ విల్లాల్ని కట్టినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. మరి, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో అక్రమంగా విల్లాల్ని కట్టేవారిని ఎలా దారిలోకి తెస్తుంది?
డ్రీమ్ వ్యాలీ అనే సంస్థ ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో డ్రీమ్ వ్యాలీ రిసార్టును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సుమారు తొంభై రూములుండగా.. అందులో ఒక్కో రోజు అద్దె సుమారు ఎనిమిది వేలకు పైగా ఉంటుంది. అంటే, ప్రతిరోజు అన్నీ గదులు బుక్ అయితే.. ఈ సంస్థకు ప్రతిరోజు గిట్టుబాటయ్యే అద్దె.. రూ.7,20,000. అంటే నెలకు రూ.2.16 కోట్ల ఆదాయం లభిస్తుంది. డెబ్బయ్ ఐదు శాతం బుక్ అయినా నెలకు కోటిన్నర ఎటూ పోదు. ఇక పెళ్ళిళ్లు, ఫంక్షన్లు వంటి వాటివల్ల మరంత ఆదాయం గిట్టుబాటవుతుంది. ఈ లెక్కన డ్రీమ్ వ్యాలీ ఇప్పటివరకూ డ్రీమ్ వ్యాలీ రిసార్టు ద్వారా ఎన్ని కోట్లు ఆర్జించిందో లెక్క వేసుకోవచ్చు. ఇలాంటివి అనేక రిసార్టులు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉండగా.. ఏ ఒక్క రిసార్టు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం శూన్యమని చెప్పొచ్చు.
ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో అక్రమంగా కట్టిన రిసార్టు ద్వారా ఆదాయం గణనీయంగా గిట్టుబాటు అవుతుండటంతో.. ఈ కంపెనీ ఒక అడుగు ముందుకేసి.. రిసార్టు వెనక భాగంలో ఇమాజిన్ అనే హై ఎండ్ లగ్జరీ విల్లా కమ్యూనిటిని అక్రమంగా నిర్మిస్తోంది. ఈ విల్లా కమ్యూనిటీలోకి ఎవరు వెళ్లాలన్నా సంస్థ ఛైర్మన్ అనుమతి ఉండాల్సిందే. లేకపోతే, లోపలికి కూడా వెళ్లనీయమని ఇమాజిన్ విల్లాస్ కమ్యూనిటీ సెక్యూరిటీ చెబుతోంది. ఒకవేళ ఈ సంస్థ హెచ్ఎండీఏ, రెరా అనుమతితో వీటిని కడుతుంటే.. కొనుగోలుదారుల్ని విల్లాల్ని చూసేందుకు అనుమతినిస్తుంది. అలా కాకుండా, ప్రవేశమార్గంలోనే సందర్శకుల్ని నిలిపివేస్తుందంటే.. ఈ సంస్థ ఎంత గుట్టుచప్పుడు కాకుండా విల్లాల్ని నిర్మిస్తుందో అర్థం చేసుకోవాలి.
15000 చ.అ.లో విల్లా..
ఇమాజిన్ విల్లా కమ్యూనిటీ బ్రోచర్‌ను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఏ వరల్డ్ ఆఫ్ పాజిబిలిటీస్ అంటూ డిజైన్ చేసిన ఈ బడా సైజ్ బ్రోచర్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే. అక్రమంగా కడుతున్న ఈ ఇమాజిన్ విల్లాస్‌లో.. అసాధ్యమనుకున్న అనేక ఫీచర్లను అందజేస్తున్నట్లు డ్రీమ్ వ్యాలీ ఇందులో పొందుపర్చింది. ఇందులో ఒక్కో విల్లాను సుమారు పదిహేను చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ.15 వేలుగా ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. అంటే, ధర దాదాపు రూ.22.50 కోట్ల దాకా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇందులో ఎంతలేదన్నా 40కి పైగా విల్లాల్ని కడుతున్నారని సమాచారం. అంటే, ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో.. ఈ ఒక్క ప్రాజెక్టు అమ్మకపు విలువ.. అన్నీ కలుపుకుంటే వెయ్యి కోట్లు దాకా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరి, స్థానిక హెచ్ఎండీఏ, రెరాల నుంచి అనుమతి తీసుకోకుండా.. డ్రీమ్ వ్యాలీ ఇంత బరితెగించి కడుతుంటే.. అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా? లేదా? ఇలా ఎవరుపడితే వారు ట్రిపుల్ వన్ జీవోలో అక్రమంగా విల్లాల్ని కట్టుకుంటు పోతే ఎలా? ఈ కమ్యూనిటీలన్నీ ఉత్పత్తి చేసే మురుగునీరంతా జంటజలాశయాల్లోకి వెళితే.. స్వచ్ఛమైన నీరును అందించేవి కాస్త రెండు హుస్సేన్ సాగర్‌లుగా మారిపోయే ప్రమాదముంది. కాబట్టి, ఈ విల్లాల్ని నేలమట్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.
ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో.. అక్రమంగా నిర్మించే విల్లాల్లో.. ఏ ప్రజాప్రతినిధి అయినా.. ఐఏఎస్ అధికారి అయినా.. కొనుగోలు చేసినా.. అందులో నివసిస్తున్నా.. ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందా?