Categories: TOP STORIES

దుమ్మురేపుతున్న జీసీసీలు

లీజింగ్ లో 17 శాతం పెరుగుదల

దేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీలు) దుమ్ము రేపుతున్నాయి. 2022-23తో పోలిస్తే 2023-24లో వీటి లీజింగ్ 17 శాతం పెరిగింది. 2022-23లో జీసీసీల లీజింగ్ 19.2 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. 2023-24లో అది 22.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇందులో ఇంజనీరింగ్ అండ్ తయారీ కంపెనీలు నాలుగింట ఒక వంతు వాటా కలిగి ఉండగా.. ఆటోమొబైల్ సంస్థలు తర్వాతి స్థానంలో ఉన్నాయి.

2024 జనవరి-మార్చి కాలంలో దేశంలో మొత్తం లీజుకు తీసుకున్న ఆఫీస్ స్పేస్ లో జీసీసీల వాటా 29 శాతంగా ఉండటం గమనార్హం. నగరాలవారీగా చూస్తే అత్యధికంగా 60 శాతం వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా.. 26 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. 9 శాతంతో ఢిల్లీ, 4 శాతంతో ముంబై, ఒక శాతం వాటాతో పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత కార్యాలయ రంగంలో జీసీసీలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. 2017-19 కాలంలో దేశంలోని మొత్తం ఆఫీస్ లీజింగ్ లో 30 నుంచి 35 శాతం వాటాతో 1250 జీసీసీలు అందుబాటులోకి వచ్చాయి. 2020-22 మధ్య కాలంలో 1580 జీసీసీలతో మొత్తం ఆఫీస్ లీజింగ్ లో 38 నుంచి 43 శాతం సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా జీసీసీల వృద్ధిలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది.

ఇక 2025 నాటికి 1900 జీసీసీలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లోని ప్రధాన కంపెనీలు దేశంలో తమ ఉనికిని జీసీసీల ద్వారా మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. ప్రీమియం ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జీసీసీలు బాగా ఆదరణ పొందుతున్నాయి. కంపెనీలు నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో జీసీసీల హవా నడుస్తోంది. ‘2024-25లో జీసీసీలు 40 నుంచి 45 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగులు జరుగుతాయని అంచనా. డిజిటల్ టెక్నాలజీపై భారతదేశం అనుసరిస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యత తదితర అంశాలు ఈ విభాగంలో వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఫలితంగా దేశంలో మరిన్ని అత్యాధునిక జీసీసీలు వచ్చే అవకాశం ఉంది’ అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమన్ మేగజీన్ పేర్కొన్నారు.

‘భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల పథం మారుతోంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రీమియం ఆఫీస్ స్పేస్ ల డిమాండ్ తో నడుస్తోంది. కంపెనీలు నాణ్యతకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఉన్నతమైన మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నాయి. ఆకర్షణీయమైన వాతావరణం, అభివృద్ధి చెందుతున్న పని విధానాలతోపాటు ఆవిష్కరణలకు, ప్రతిభకు భారత్ ప్రధాన గమ్యస్థానంగా వృద్ధి చెందుతోంది’ అని సీబీఆర్ఈ ఇండియా అడ్వైజరీ, ట్రాన్సాక్షన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ చందనాని తెలిపారు.

This website uses cookies.