Categories: TOP STORIES

గ్రీన్ తెలంగాణ 2050 మాస్ట‌ర్ ప్లాన్

తెలంగాణ రాష్ట్రాన్నీ గ్రీన్ తెలంగాణ‌గా డెవ‌ల‌ప్ చేస్తామ‌ని.. ఇందుకోసం 2050 మాస్ట‌ర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. స్వల్పకాలిక ఆలోచనలు కాదు… దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నామ‌ని అన్నారు. మొత్తం తెలంగాణకు “గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్” తయారు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామ‌ని.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించామ‌ని వివ‌రించారు. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి… ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తామ‌ని చెప్పారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా తీర్చిదిద్దబోతున్నాం. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించాం. రీజినల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.

రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది… పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం.

తెలంగాణను ఎడ్యూకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసింది.

అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీని కోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించాం. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నాం.

This website uses cookies.