Categories: Celebrity Homes

ఉత్సాహాన్ని పెంచేలా ఇల్లుండాలి

  • రియల్ ఎస్టేట్ గురుతో నటి ఈషా రెబ్బా

ఎవరైనా కొత్త ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదే తాము కోరుకున్న ఎన్నో అంశాలతో ఉన్న ఇంటిని కొనుక్కుంటే అది మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నటి ఈషా రెబ్బా తన అందమైన కలల ఇంటి కోసం ఎంత ఆతృతగా ఉన్నారో ‘రియల్ ఎస్టేట్ గురు’తో పంచుకున్నారు.

‘నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. కానీ త్వరలోనే కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏకాంతంగా ఉండే చాలా సాధారణమైన ఇల్లు ఉండాలని అనుకుంటున్నాను. త్వరలోనే అది నెరవేరుతుందని భావిస్తున్నాను. ఇటీవలే నేను ఓ కొత్త అపార్ట్ మెంట్ కి మారాను. నాకు అది బాగా నచ్చింది’ అని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ తీరిక లేకుండా బిజీబిజీగా గడిపే ఈషా.. తరచుగా దాని నుంచి కాస్త విరామం కోరుకుంటారు. తన బిజీ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం కలిగించే, తాను ఇష్టపడే అన్ని విషయాలను గుర్తుకుతెచ్చే, తనను పూర్తిగా రీచార్జ్ చేసే ఇల్లే అందుకు తగిన వేదిక అన్నది ఈషా అభిప్రాయం. తన ఇంటి డిజన్ ఎలా ఉండాలనే అంశంపై మాట్లాడుతూ.. ‘నేను నా ఇంటి డిజైన్ మినిమలిస్టిక్ గా ఉంచడానికే ఇష్టపడతాను. విలాసవంతమైన డెకరేషన్ నాకు నచ్చదు. నాకు, నాన్నకు, నా రెండు కుక్కలకు సరిపోయేలా మొక్కలతో కూడిన సాధారణ స్థలం ఉంటే చాలు’ అని వివరించారు.

ఇల్లు అనేది సౌకర్యవంతంగా, హాయిగా ఉండాలనేదే ఈషా ప్రథమ కోరిక. మినిమలిస్టిక్ ఫర్నిచర్ అంటే బోరింగ్ గా ఉండే చవకైన గృహాలంకరణ వస్తువులు కాదన్నది ఆమె అభిప్రాయం. తన ఆలోచనలకు తగిన విధంగా తన మూడ్ కు అనుగుణంగా అవి ఉండాలి. ‘నా ఇంటిని అలంకరించుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా అవసరం లేదు. నా దగ్గర ఉన్నదాంతోనే నా ఇంటిని సాధారణంగా, సరళంగా ఉంచుకుంటాను’ అని పేర్కొన్నారు. ఇంటికి సంబంధించి విల్లాకే తాను ఓటేస్తానని స్పష్టంచేశారు. ‘నేను నివసించడానికి గేటెడ్ కమ్యూనిటీ అత్యంత సురక్షితమని నమ్ముతాను. పైగా మీ సొంత ఇల్లు అనే భావనను మించిన ఆనందం ఏదీ ఉండదు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ నగరం. రియల్ ఎస్టేట్ పరంగా విస్తృతమైన అవకాశాలు కలిగిన ప్రాంతం. నేను నా సొంత నగరంలో అత్యాధునికంగా ఉండే విల్లాలను పుష్కలంగా ఎంచుకోగలను. కానీ జోహెన్నెస్ బర్గ్ నా కలల ప్రదేశం’ అని వెల్లడించారు. కొంత గోప్యత, పూర్తి వినూత్నంగా తన ఇల్లు ఉండాలనేది ఆమె అభిమతం.

ఇంకా ఆమె తన గురించి ఏం చెప్పారంటే.. ‘నేను మొక్కలు, కుక్కలను బాగా ఇష్టపడతాను. నేను ఇండోర్ గార్డెనింగ్ లో మునిగిపోవడాన్ని బాగా ఆస్వాదిస్తాను. ఇంట్లో ఉన్న మొక్కలతో నా కుక్కలకు కూడా ప్రయోజనాలున్నాయని తేలింది. మన పెరట్లో కూరగాయలు పండిస్తుంటే చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది? నా ఇంటిని పచ్చగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాను. అలాగే రణగొణ ధ్వనులకు దూరంగా కాలుష్యరహిత వాతావరణంలో జీవించడానికే ఇష్టపడతాను. మీ ఇంట్లో మొక్కలు పెంచడం ప్రారంభించడానికి ఏదైనా మంచి ముహూర్తమే’ అని స్పష్టంచేశారు.
జోహెన్నెస్ బర్గ్ ఎందుకు ఇష్టం అని ఈషాని ప్రశ్నించగా.. ‘అక్కడ జంతు అభయారణ్యం ఉంది. అక్కడ ఎక్కువ సమయం గడపడం ఇష్టపడతాను. పైగా దానికి సమీపంలోనే ఇల్లుంటే ఇంకా బావుంటుంది. ఇక మన కలల సౌథం నిర్మించుకునేటపుడు భద్రత కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎలాంటి ప్రమాదాలూ జరగని ఇల్లు ఉండాలి. నా కుటుంబానికి ఎలాంటి హానీ జరగకూడదని కోరుకుంటాను. నా ఇల్లు నా భావాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల అది నా ఉత్సాహాన్ని పెంపొందించేలా ఉండాలి’ అని ఈషా ముగించారు.

This website uses cookies.