Categories: TOP STORIES

ఎంపైర్ మిడోస్.. ఏమిటీ దారుణం?

బిల్డర్ కు టీఎస్ రెరా ఆదేశం

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో తలెత్తిన నిర్మాణపరమైన లోపాలను వెంటనే పరిష్కరించాలని బిల్డర్ కు తెలంగాణ రెరా ఆదేశించింది. ఈ మేరకు రెరా చైర్ పర్సన్ జస్టిస్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ, సభ్యులు కె. శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జున్నులతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. సంగారెడ్డి జిల్లా ఎంపైర్ మిడోస్ అపార్ట్ మెంట్ కు చెందిన నివాసితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన బెంచ్ ఈ ఉత్తర్వులిచ్చింది.

ఫిర్యాదుదారులు 2020 ఫిబ్రవరి 14న ఈ ప్రాజెక్టులో 3 బీహెచ్ కే ఫ్లాట్లు కొనుగోలు చేశారు. నిర్దేశిత మొత్తం పూర్తిగా చెల్లించినప్పటికీ, ఇంకా పలు బ్లాకులు, సౌకర్యాల కల్పన నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్త బ్లాకులకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ లైన్లు, కార్ పార్కింగ్ స్లాట్లను కేటాయించకపోవడం, సౌకర్యాల కల్పనలో జాప్యం జరగడంతో పాటు ఇంకా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలు అక్కడి నివాసితులకు ఇబ్బందిగా మారాయి.

  • వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తి కావాలి. కానీ ఇంకా పనులు సాగుతుండటంతో కాలుష్యం, రణగొణ ధ్వనులు, దుమ్ము తదితరాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా క్లబ్ హౌస్, పిల్లల ఆటస్థలం వంటి సౌకర్యాలు ఏమీ కల్పించకుండా పారదర్శకత లేకుండా నిర్వహణ చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. డ్రైనేజీలను సరిగా నిర్వహించకపోవడంతో అవి దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై బిల్డర్ తో ఎన్నిసార్లు మాట్లాడిన సరైన స్పందన లేదన్నారు. దీంతో వారు టీఎస్ రెరాను ఆశ్రయించారు. వాదనలు విన్న బెంచ్.. క్లబ్ హౌస్ పక్కనున్న స్థలాన్ని డెవలప్ చేసి అసోసియేషన్ కు అప్పగించాలని ఆదేశించింది. అలాగే ఎమినిటీస్ బ్లాక్ ను కూడా వెంటనే అప్పగించాలని సూచించింది.

This website uses cookies.