Categories: LATEST UPDATES

ఏడేళ్లలో మరో మూడు కోట్ల మందికి ఉపాధి

దేశంలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగం 2030 నాటికి మరో మూడు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. పట్టణ ఇళ్లకు డిమాండ్ పెరగడం, ప్రభుత్వాలు రోడ్లు వంటి మౌలిక వసతులకు ఎక్కువ ఖర్చు పెడుతుండటం వంటి అంశాలు నిర్మాణ రంగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 7 కోట్ల మంది ఉపాధి పొందుతుండగా.. 2030 నాటికి వారి సంఖ్య పది కోట్లకు చేరుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ పేర్కొంది.

రేట్ల పెరుగుదల, స్వల్పకాలిక సవాళ్లు ఉన్నప్పటికీ.. తయారీ, సేవల ఎగుమతులు, వినియోగదారుల డిమాండ్ నడిచే భారత ఆర్థిక వ్యవస్థ 2031 నాటికి 6.7 శాతానికి పెరుగుతుందని ఎస్అండ్ పీ గ్లోబల్ సంస్థ అంచనా వేసింది. కరోనా సమయంలో భారీగా నష్టాలు చూసిన రియల్ రంగం వేగంగా కోలుకుందని.. రోడ్డు నెట్ వర్కులు, పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం పెరిగిందని నైట్ ఫ్రాంక్ సీనియర్ డైరెక్టర్ గులామ్ జియా పేర్కొన్నారు.

పెరుగుతున్న గృహ ఆదాయాలు, భారత్ కు ఔట్ సోర్సింగ్ చేస్తున్న గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ల కారణంగా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతోపాటు చిన్న పట్టణాలలో స్తిరాస్థి డిమాండ్ పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం 650 బిలియన్ డాలర్లుగా వార్షిక రియల్ ఎస్టేట్ టర్నోవర్ 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని వెల్లడించారు.

This website uses cookies.