Categories: ReraUncategorized

ప్రాజెక్టు పూర్తయినా.. రిఫండ్ ఇవ్వాలని రెరా ఆదేశం

సకాలంలోనే నిర్మాణం పూర్తయినప్పటికీ, కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని కర్ణాటక రెరా ప్రముఖ డెవలపర్ శోభా లిమిటెడ్ ను ఆదేశించింది. దక్షిణ బెంగళూరులోని శోభా వ్యాలీ వ్యూలో హేమాంబిక సుబ్రమణి ఓ అపార్ట్ మెంట్ బుక్ చేసుకున్నారు. సకాలంలోనే నిర్మాణం పూర్తయింది. అయితే, బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద ఆదాయ పన్ను శాఖ ఆ ప్రాజెక్టు భూమిని అటాచ్ చేయడం వల్ల శోభా లిమిటెడ్ దానిని స్వాధీనం చేయడంలో విఫలమైందని కొనుగోలుదారు రెరాను ఆశ్రయించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్లను పొంది స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శోభా లిమిటెడ్ పేర్కొంది. అయితే, భూ వాజ్యం కారణంగా ఆదాయపు పన్ను శాఖ ప్రాజెక్టు భూమిని అటాచ్ చేయడంతో ఎలాంటి బదిలీ లేదా లావాదేవీలు జరగడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసినా.. స్వాధీనం చేయడంలో విఫలమైనందున రెరా.. కొనుగోలుదారు పక్షాన నిలిచింది. డెవలపర్ అంగీకరించిన వ్యవధిలోగా స్వాధీనం చేయడంలో విఫలమైతే రెరా చట్టం ప్రకారం వడ్డీతో సహా తమ సొమ్మును వాపసు పొందే హక్కు కొనుగోలుదారుకు ఉంటుందని తేల్చి చెప్పింది. వెంటనే కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని శోభా లిమిటెడ్ ను ఆదేశించింది.

This website uses cookies.