Categories: LATEST UPDATES

ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ అదుర్స్

టాప్-3లో మన భాగ్యనగరం
మూడో త్రైమాసికంలో 261 శాతం వృద్ధి
సీబీఆర్ఈ నివేదికలో వెల్లడి

ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ అదరగొట్టింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో ఆధిపత్యం చెలాయించిన టాప్-3 నగరాల్లో మన భాగ్యనగరం నిలిచింది. ఈ త్రైమాసికంలో ఏకంగా 3.1 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది. వార్షికంగా చూస్తే 261 శాతం వృద్ధి నమోదైంది. ఈ లీజింగ్ లో లైఫ్ సైన్సెస్ వాటా 30 శాతం ఉండగా.. బీఎఫ్ఎస్ఐ 24 శాతం, టెక్నాలజీ 23 శాతం వాటా కలిగి ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాతిపదికన చూస్తే 9 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు 33 శాతం పెరగడం విశేషం. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ 15.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు టాప్-3లో నిలిచాయి. ఈ మూడు నగరాలూ కలిసి 60 శాతం వాటా కలిగి ఉన్నాయి.

* ఇక జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 9 నగరాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ సరఫరా 19.3 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. వార్షికంగా చూస్తే 94 శాతం పెరుగుదల నమోదైంది. సరఫరాలో బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాలు టాప్ లో ఉన్నాయి. ఈ మూడు నగరాల వాటా 77 శాతం కావడం గమనార్హం. ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయానికి వస్తే.. చిన్న పరిమాణ (10వేల చదరపు అడుగుల కంటే తక్కువ) లావాదేవీల నుంచి మధ్యస్థ పరిమాణ (10వేల చదరపు అడుగుల నుంచి 50వేల చదరపు అడుగుల వరకు) లావాదేవీల వాటా 86 శాతం ఉంది. ఇది చాలా వరకు స్థిరంగా ఉంది. పెద్ద పరిమాణ (లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ) ఒప్పందాల వాటాలో స్వల్ప పెరుగుదల నమోదైంది. గత త్రైమాసికంలో ఇది 6 శాతం ఉండగా.. మూడో త్రైమాసికంలో 7 శాతానికి పెరిగింది. పెద్ద పరిమాణ ఒప్పందాల్లో బెంగళూరు, హైదరాబాద్ టాప్ లో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో చెన్నై, ఢిల్లీ ఉన్నాయి. భారత కార్యాలయ రంగం ఈ ఏడాది అంచనాలను అధిగమించిందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజైన్ పేర్కొన్నారు. ‘ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో ఆఫీస్ స్పేస్ ఊహించిన దాని కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. భారతదేశం ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని స్థితిస్థాపకత ప్రదర్శించడమే ఇందుకు కారణం. అలాగే గ్లోబల్ కార్పొరేషన్లు తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను స్థాపించడానికి భారత్ ఓ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది’ అని వివరించారు.

This website uses cookies.