Categories: EXPERT COLUMN

జీవో 69లో అంతా తప్పుడు సమాచారమే

  • ఇది జంట జలాశయాల భద్రతకు ముప్పు
  • మీ పేరిట వెలువరించిన జీవోను ఉపసంహరించుకోండి
  • గవర్నర్ కు తెలియజేసిన పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్

జంటనగరాల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరిక్షణకు 1996లో ఇచ్చిన ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ప్రముఖ పర్యావరణవేత్త, జలవనరుల మండలి రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ లుబ్నా సర్వత్ పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అటు చట్టపరంగా గానీ, ఇటు సంబంధిత నిపుణుల నుంచి గానీ ఎలాంటి మద్దతూ లేదన్నారు. రాష్ట్ర పాలసీలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 48ఏ ప్రకారం.. పర్యావరణాన్ని పరిరక్షించి, మెరుగుపరచడంతో పాటు దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనన్నారు. కానీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ జంట జలాశయాల విషయంలో అలాంటిది ఏమీ జరగడం లేదని విమర్శించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాశారు.

ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1996 మార్చి 8న ఇచ్చిన 111 జీవోలోని పేరా 3ను తొలగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 12న తెలంగాణ ప్రభుత్వం జీవో 69 జారీ చేసిందని తెలిపారు. జలాశయాల గరిష్ట నిల్వ ప్రాంతం (ఎఫ్ టీపీ) నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, ప్రధాన హోటళ్లు, నివాస గృహాల నిర్మాణాన్ని నిషేధిస్తూ జీవో 111 తీసుకొచ్చారని, కానీ ప్రస్తుతం ఆ జీవోను ఎత్తివేశారని, ఇది సరికాదని పేర్కొన్నారు. పైగా తెలంగాణ గవర్నర్ ఆదేశాల మేరకు అని జారీ అయిన జీవో నెం.69లో తప్పుడు సమాచారం ఉండటమే కాకుండా ఎటువంటి శాస్త్రీయ లేదా నిపుణుల నివేదికలు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలోని వందేళ్ల నాటి రెండు రిజర్వాయర్ల భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ లో 1908 తరహా వరదలను నివారించే ఉద్దేశంతో నిర్మించిన ఈ రిజర్వాయర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లుబ్నా పేర్కొన్నారు. లేఖలోని మరిన్ని వివరాలివీ..

  • పారిశ్రామిక, వ్యవసాయం నిపుణులతో కూడిన కమిటీతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ అండ్ సివరేజ్ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదకల ఆధారంగా జీవో 111 జారీ చేశారు. కానీ, జీవో 69 జారీ చేసినప్పుడు ఎలాంటి కమిటీ నివేదికలూ లేవు.
  • జంట జలాశయాల నుంచి 10 కిలోమీటర్ల బఫర్ జోన్ లో కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదని జీవో 111ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
  • అలాగే 16-8-2000లో డాక్టర్ భౌమిక్, 2000 జూన్ లో ఎన్ జీఆర్ఐలు నివేదికలు సమర్పించగా.. జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథార్టీ కూడా సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది.
  • మొత్తం ఐదు శాస్త్రీయ, నిపుణుల నివేదికలు జీవో 111కి మద్దతుగా ఉండగా.. ఈ జీవోలోని పరిమితులను ఎత్తివేస్తూ తీసుకొచ్చిన జీవో 69కి ఒక్కటంటే ఒక్క నివేదిక కూడా మద్దతుగా లేదు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా మేం అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం లేదు.
  • తెలంగాణ గవర్నర్ పేరుతో జారీ అయిన జీవో 69లో తప్పుడు సమాచారం పొందుపరిచారు. ‘హైదరాబాద్ లో తాగునీటి సామర్థ్యం 145 ఎంజీడీ నుంచి 602 ఎంజీడీకి పెరిగి అంతమేర అందుబాటులోకి వచ్చింది. అదనంగా 344 ఎంజీడీ తాగునీటి సామర్థ్యం పెంచే పనులు జరుగుతున్నాయి. అందువల్ల ఈ జంట జలాశయాల నుంచి తాగునీటి వినియోగం 1.25 శాతాని కంటే తగ్గిపోయింది. ఇకపై హైదరాబాద్ నగరం తాగునీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత జీవో 111లోని పేరా 3లో పొందుపరిచిన ఆంక్షలను తొలగించాలని నిర్ణయించింది’ అని జీవోలో పేర్కొన్నారు. కానీ అందులోని చాలా అంశాలు వాస్తవానికి విరుద్దంగా ఉన్నాయి.
  • ఈనెల 19న సైతం ఉస్మాన్ సాగర్ నుంచి 56 ఎంజీడీ, హిమాయత్ సాగర్ నుంచి 29 ఎంజీడీ నీటిని గ్రావిటీ ద్వారా వినియోగించారు. జీవో 69 విడుదల చేసిన రోజు సైతం ఉస్మాన్ సాగర్ నుంచి 73 జీఎండీ, హిమాయత్ సాగర్ నుంచి 24 జీఎండీ నీటిని గ్రావిటీ ద్వారా తీసుకున్నారు. ఇది 5 శాతం కంటే ఎక్కువ. అంటే జీవోలో తప్పుడు సమాచారం పొందుపరిచినట్టు అర్థమవుతోంది.
  • హైదరాబాద్ నగర తాగునీటిని తీరుస్తుందని ప్రభుత్వం ప్రకటించిన కాళేశ్వరం ప్రాజెక్టు అనిశ్చితిలో పడింది. గతనెలలో భద్రాచలం సమీపంలో వచ్చిన వదరల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారంలోని 29 పంపులు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర దాహార్తిని తీరుస్తున్న జంట జలాశాయల అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించడం కచ్చితంగా తప్పుడు సమాచారమే.
  • ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తెలంగాణ గవర్నర్ పేరిట తప్పుడు సమాచారంతో వచ్చిన, జంట జలాశయాలకు ముప్పుగా పరిణమించిన జీవో 69ని ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తున్నాం.

This website uses cookies.