Categories: LATEST UPDATES

హైదరాబాద్ లో అమ్మకాలు తగ్గాయ్

  • నిర్మాణ వ్యయం పెరగడంతో పెరిగిన ధరలు
  • భూమి ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెంపు
  • ఫలితంగా తగ్గిన అమ్మకాలు

కరోనా మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుని గాడిన పడినప్పటికీ, హైదరాబాద్ లో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాజెక్టులు ఇంకా నిర్మాణంలోనే ఉన్నందును అమ్ముడుపోని రెసిడెన్షియల్ ఇన్వెంటరీ 50 శాతానికి పైగా ఉండటమే ఇందుకు నిదర్శనం. క్రెడాయ్, కొలియర్స్, లయ‌సెస్ ఫాస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో కొత్త ప్రాజెక్టుల లాంచ్ ఊపందుకున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్ముడు కానీ ఇన్వెంటరీ 55 శాతం ఉందని నివేదిక‌లో తేలింది. అమ్ముడుపోని రెసిడెన్షియల్ యూనిట్లు 96 శాతం నిర్మాణంలో ఉన్నట్టు వెల్లడైంది. హైదరాబాద్, అహ్మదాబాద్ మినహా మిగిలిన నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ తగ్గినట్టు నివేదిక పేర్కొంది.

గతేడాది నిర్మాణ వ్యయం పెరగడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు, భూమి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో చాలా ఇళ్లు నిర్మాణంలోనే ఉండిపోగా, పూర్తయిన ఇళ్లు కూడా అమ్ముడు కావట్లేదు. ఫలితంగా అమ్ముడుపోని ఇన్వెంటరీ పెరుగుతోంది. అంతేకాకుండా హైదరాబాద్ శివార్లలో సైతం 2 బీహెచ్ కే ఫ్లాట్ ధర రూ.50 లక్షలకు తక్కువ ఉండటం లేదు. ఫ్లాట్ల ధరలు దాదాపు రూ.10 లక్షల మేర పెరగడంతో చాలామంది అంత వెచ్చించలేకపోతున్నారని తెలంగాణ రియల్టర్ల సంఘం అధ్య‌క్షుడు ఎన్. ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు టెక్నాలజీ రంగం ఉద్యోగుల నుంచి ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో కొత్త ప్రాజెక్టులు కూడా బాగానే వచ్చాయి. ఇక హైదరాబాద్ నైరుతి ప్రాంతంలో ఇళ్ల ధరలు 15 శాతం మేర పెరిగాయి. మొత్తమ్మీద హైదరాబాద్ లో గృహాల ధరలు ఎనిమిది శాతం ఎక్కువయ్యాయి.

హైదరాబాద్ లో రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున రూ.5వేల‌ నుంచి రూ.6 వేలకు పెరిగింది. దీంతో ముంబై తర్వాత రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్ మారింది. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చదరపు అడుగు సగటు ధర రూ.9,218గా ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పరిస్థితి చూస్తే బెంగళూరు సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో 5 శాతం పెరుగుదల నమోదైంది. అత్యధికంగా ఢిల్లీ-ఎన్సీఆర్ లో 10 శాతం పెరుగుదల కనిపించింది. 9 శాతం పెరుగుదలతో అహ్మదాబాద్ రెండో స్థానంలో ఉండగా.. 8 శాతం పెరుగుదలతో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. కాగా, హైదరాబాద్ లో రెసిడెన్షియల్ యూనిట్లకు సంబంధించి ప్రధాన మైక్రో మార్కెట్లు హిమాయత్ నగర్, సోమాజీగూడ, బేగంపేట, అమీర్ పేట, ఈసీఐఎల్, ఘట్కేసర్, మల్కాజ్ గిరి, మేడ్చల్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, నానక్ రామ్ గూడ, బోడుప్పల్, కర్మన్ ఘాట్, కొత్తపేట, ఎల్బీ నగర్, ఉప్పల్, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, షేక్ పేట, శంషాబాద్ ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

This website uses cookies.