కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన కలకలం తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఆర్‌బీఐ ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని క్రెడాయ్ నేషనల్ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఊహించినట్టుగానే ఆర్‌బిఐ ఆగస్టు 6 న కీలక పాలసీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని అన్నారు. ఈ నిర్ణయం సాధారణంగా రియల్ ఎస్టేట్ పరిశ్రమకు మరియు ముఖ్యంగా గృహ కొనుగోలుదారులకు ఉపయోగపడుతుంది.
తక్కువ వడ్డీ రేట్ల వల్ల ఇళ్లను కొనడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ బలపడటంతో.. ఆర్‌బీఐ తాజా నిర్ణయం వల్ల భారతదేశంలో కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ వంటి సురక్షిత రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తారని అభిప్రాయపడ్డారు.