- 5 నుంచి 7 శాతం పెరిగే చాన్స్
ఐటీ రాజధాని బెంగళూరులో ఆఫీస్ అద్దెలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐటీ, ఏఐ ఆధారిత సంస్థల నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా నగరంలో కార్యాలయ అద్దెలు 5 నుంచి 7 శాతం మేర పెరగొచ్చని చెబుతున్నారు. గతేడాది గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల నుంచి గణనీయమైన డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం ఐటీ, ఏఐ ఆధారిత పరిశోధన సంస్థల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఏఐ పరిశోధన సంస్థల ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు వీటి నుంచి డిమాండ్ పెరగడానికి కారణమవుతున్నాయి.
ఆన్ లైన్ గేమింగ్ స్టార్టప్ లు, ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోందని.. ఈ నేపథ్యంలో 2025లో ఫ్లెక్స్ రంగంలో ఇవి గేమ్ ఛేంజర్లుగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి బెంగళూరులో ప్రీమియం గ్రేడ్-ఎ స్థలాల డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఇన్ పుట్ ఖర్చులను భారీగా పెంచింది. బెంగళూరు సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లోని ప్రధాన ప్రదేశాల్లో ఫ్లెక్స్ ఆఫీస్ అద్దెలు గతేడాదితో పోలిస్తే.. 20 శాతం మేర పెరిగాయి.
దీంతో ఇన్ పుట్ వ్యయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం బెంగళూరులో ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ అద్దె సీటుకు రూ.6 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంది. ఐడీ కారిడార్లు, సీబీడీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ అయితే సీటుకు రూ.15వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. తూర్పు, ఉత్తర బెంగళూరుల్లో ఫ్లెక్స్ స్పేస్ డిమాండ్ పెరిగింది. వైట్ ఫీల్డ్ లోని తూర్పు ఐటీ కారిడార్ లో గత ఆరు నెలల్లో ఫ్లెక్స్ స్పేస్ లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.