Categories: LATEST UPDATES

పీఎంఏవై-యు పొడిగించండి

  • లోక్ సభకు స్థాయీసంఘం నివేదిక

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యు) ప్రయోజనాలను అర్హత ప్రమాణాలు, ఇతర అవరోధాల కారణంగా కొందరు వ్యక్తులు పొందలేకపోతున్నారని హౌసింగ్, అర్బన్ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షించాలని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సూచించింది. అలాగే 2024 డిసెంబర్ 31తో ముగుస్తున్న ఈ పథకాన్ని అవసరమైతే పొడిగించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు స్థాయీ సంఘం తన నివేదికను లోక్ సభకు సమర్పించింది.

2015లో ఈ పథకం ప్రారంభమైనప్పుడు 2012-17 మధ్యకాలంలో దేశంలో 1.88 కోట్ల గృహాల కొరత ఉందని అంచనా వేశారు. ‘భారత్ లో మురికివాడల కుటుంబాలు 18 మిలియన్లకు పెరుగుతాయని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అలాగే 2 మిలియన్ల నాన్ స్లమ్ అర్బన్ పేద కుటుంబాలను ఈ పథకం కింద కవర్ చేయాలని ప్రతిపాదించారు. అందువల్ల మొత్తం గృహాల కొరత 20 మిలియన్లకు చేరింది. అయితే, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అంచనా ప్రకారం 1.23 కోట్ల గృహాల డిమాండ్ ఉంది’ అని నివేదిక పేర్కొంది. 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 1.22 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. వీటని పూర్తి చేయడం కోసం ఈ పథకాన్ని 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. నిర్మాణం ప్రారంభించిన 1.05 కోట్ల ఇళ్లలో ఇప్పటికి 64.33 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.

This website uses cookies.