Categories: LATEST UPDATES

పెరగనున్న ఆఫీస్ లీజింగ్

  • 2023లో 35-38 మిలియన్ చ.అ. ఉండే చాన్స్
  • హైబ్రిడ్ వర్కింగ్ మోడల్
    వైపు 63 శాతం మంది మొగ్గు
  • కొలియర్స్ నివేదికలో వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా పరిణామాలన్నీ సాధారణ స్థితిలో ఉంటే భారత్ లో 2023లో దాదాపు 35-38 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకునే అవకాశం ఉందని కొలియర్స్ నివేదిక వెల్లడించింది. ఒకవేళ అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్న పక్షంలో ఇది 30-33 మిలియన్ చదరపు అడుగులు ఉండొచ్చని పేర్కొంది. ఆఫీస్ మార్కెట్ ప్రస్తుతం అనిశ్చితితో కనిపిస్తున్నప్పటికీ, త్వరలో పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, బీఎఫ్ఎస్ఐ కంపెనీలు, సౌండ్ బిజినెస్ మోడల్స్ తో స్టార్టప్ ల నేతృత్వంలో లీజింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది ద్వితీయార్థంలో పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ మంది హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

గతేడాది హైబ్రిడ్ వర్కింగ్ పై కొలియర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం.. 63 శాతం మంది ఈ విధానం పట్ల ఆసక్తి కనబరిచారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇళ్లకు దగ్గరగా ఉండే ప్రదేశాల నుంచి పని చేయడానికి ఇష్టపడతారు కాబట్టి.. సంస్థలు కూడా తమ వ్యాపార కేంద్రాల్లో కార్యాలయ స్థలాలను విభజించాలని యోచిస్తున్నాయి. ‘హైబ్రిడ్ వర్కింగ్ అనేది భవిష్యత్తులో గేమ్ ఛేంజర్. ఉద్యోగుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా కార్యాలయాలు హైబ్రిడ్ మోడల్ ను స్వీకరించడం పెరిగే అవకాశం ఉంది. ఇది కంపెనీలకు కూడా ప్రయోజనం కలిగిస్తుంది. సంస్థలు తమ పెద్ద పెద్ద కార్యాలయాలను శాటిలైట్ కార్యాలయాలు విభజించి వాటిని ఉద్యోగుల ఇళ్లకు దగ్గరగా తీసుకుని వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఫ్లెక్స్ స్పేస్ లకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో హైబ్రిడ్ వర్కింగ్ కీలకంగా మారనుంది’ అని కొలియర్స్ ఇండియా సీనియర్ డైరెక్టర్, రీసెర్చ్ హెడ్ విమల్ నాడార్ పేర్కొన్నారు.

This website uses cookies.