Categories: LATEST UPDATES

రియల్ రారాజు.. ముంబై

  • గతేడాది భూ లావాదేవీల్లో అదరగొట్టిన ఆర్థిక రాజధాని
  • రికార్డు స్థాయిలో భూముల కొనుగోళ్లు

రియల్ రంగంలో దేశ ఆర్థిక రాజధాని మరోసారి సత్తా చాటింది. గతేడాది భూ లావాదేవీల్లో రికార్డు సృష్టించింది. 2024లో డెవలపర్లు 19 లావాదేవీలలో దాదాపు 407 ఎకరాలు కొనుగోలు చేశారు. గత మూడేళ్లలో ఇది అత్యధికం కావడం విశేషం. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో 2023లో 288.9 ఎకరాల కొనుగోళ్లు జరగ్గా.. 2024లో 41 శాతం పెరిగి 407 ఎకరాల కొనుగోళ్లు నమోదయ్యాయని జేఎల్ఎల్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఖలాపూర్, పాల్ఘర్, ఖోపోలి వంటి అభివృద్ధి చెందుతున్న మైక్రో మార్కెట్లలో 50 ఎకరాలు అంతకంటే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరగడం విశేషం. లావాదేవీల పరిమాణం పెరగడంతో పాటు ఈ ప్రాంతంలో ఎకరానికి భూమి ధర కూడా బాగా పెరిగింది.

2022లో ఇక్కడ ఎకరం భూమి ధర రూ.11 కోట్లు ఉండగా.. 2024లో రూ.17 కోట్లకు పెరిగింది. బిర్లా ఎస్టేట్స్, కె రహేజా కార్ప్, మహీంద్రా & మహీంద్రా వంటి ప్రముఖ డెవలపర్లు ఈ కొనుగోళ్లలో కీలకపాత్ర పోషించారు. గతేడాది సెప్టెంబర్లో బిర్లా ఎస్టేట్స్ థానేలోని కల్వా ప్రాంతంలో హిందాల్కో నుంచి 24.5 ఎకరాల ప్లాట్‌ను రూ.537.42 కోట్లకు కొనుగోలు చేసింది. బోయిసర్‌లో 70.92 ఎకరాలను రూ.104.32 కోట్లకు కొనుగోలు చేసింది. డిసెంబర్‌లో కె రహేజా కార్ప్ కండివాలి తూర్పులోని అశోక్ నగర్‌లో 5.75 ఎకరాల ప్లాట్‌ను రూ.466 కోట్లకు సొంతం చేసుకుంది. ఆగస్టులో హాజీ అలీ జంక్షన్ సమీపంలోని టార్డియోలోని ది బేసైడ్ మాల్, పాపులర్ ప్రెస్‌ను రూ.355 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, దేశవ్యాప్తంగా కూడా భూముల కొనుగోళ్లు బాగానే జరిగినట్టు నివేదిక తెలిపింది.

23 ప్రధాన నగరాల్లో 134 లావాదేవీల ద్వారా 2,335 ఎకరాల భూమిని డెవలపర్లు కొన్నట్టు వెల్లడించింది. రూ.39,742 కోట్ల విలువైన ఈ కొనుగోళ్ల ద్వారా 194 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని వివరించింది. మొత్తం భూ ఒప్పందాలలో టైర్ I నగరాలు 72% వాటా కలిగి ఉండగా, చిన్న పట్టణ కేంద్రాలు కూడా చక్కని పనితీరు కనబరిచాయి. కొనుగోళ్లలో టైర్ II, III నగరాలు 28% వాటా కలిగి ఉన్నాయి. వీటిలో 662 ఎకరాలు లావాదేవీలు జరిగాయి. నాగ్‌పూర్, వారణాసి, ఇండోర్, బృందావన్, లూథియానా వంటి నగరాలు ఊహించని హాట్‌స్పాట్‌లుగా ఉద్భవించాయి.

This website uses cookies.