నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టీకరణ
హైదరాబాద్ లోనూ చేపట్టాలంటున్న నిపుణులు
30 ఏళ్లకు పైబడిన వయసున్న భవనాలను అధీకృత ఆడిటర్లతో స్టక్చరల్ ఆడిట్ చేయించాలని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంఎంసీ) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఏవైనా మరమ్మతులు లేదా ఇతర పనులు చేసేముందు కచ్చితంగా స్టక్చరల్ ఆడిట్ చేయాలని స్పష్టంచేసింది. అలాకాకుండా పనులు చేపట్టి ఏదైనా ప్రమాదానికి కారణమైతే సదరు సొసైటీ సెక్రటరీ లేదా ప్రెసిడెంట్ ను బాధ్యులుగా చేసి చర్యలు చేపడతామని హెచ్చరించింది. నిజానికి నవీముంబై 50 ఏళ్ల వయసున్న నగరం.
సాధారణంగా సరైన మెయింట్ నెన్స్ చేసే సిమెంట్ కాంక్రీట్ భవనం 60 ఏళ్లపాటు ఉంటుంది. అయినప్పటికీ, నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముందు జాగ్రత్త చర్యగా 30 ఏళ్ల పైబడిన వయసున్న భవనాలకు స్టక్చరల్ ఆడిట్ చేయాలని నిర్ణయించింది. మరి మన హైదరాబాద్ వయసు 400 ఏళ్లకు పైమాటే. ఇప్పటికీ నగరంలో చాలా ప్రదేశాల్లో పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్ని నిర్మాణాలు వందేళ్లవి కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఇలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం వచ్చేలోపు ఈ ప్రక్రియ పూర్తిచేస్తే ఎలాంటి ప్రమాదాలూ జరగవని పేర్కొంటున్నారు.