నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సదరు బిల్డర్లకు ఏకంగా మూడేళ్ల సమయం ఇవ్వడం సరికాదని ఇళ్ల కొనుగోలుదారుల అపెక్స్ బాడీ ‘ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్‘ (ఎఫ్ పీసీఈ) పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఎఫ్ పీసీఈ అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ లేఖ రాశారు. నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు సంబంధించి నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన కొన్ని సిఫార్సులపై అభయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తన నివేదికను గతనెల 21న సమర్పించింది.
దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల వరకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిలిచిపోయి ఉన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు దివాళా చట్టంలో మార్పులు, వడ్డీ రాయితీతో కూడిన పథకం తీసుకురావడం వంటివి చేయాలని అమితాబ్ కాంత్ కమిటి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని సిఫార్సుల పట్ల అభయ్ ఆందోళన వ్యక్తంచేస్తూ లేఖ రాశారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం ఇవ్వడం సరికాదని, కేవలం కొన్ని ప్రాజెక్టులకే ఇది వర్తింపజేయాలని.. లేని పక్షంలో త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న బిల్డర్లు దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులవారీగా విభజించి, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కాలావధి నిర్దేశించాలన్నారు. రెండేళ్ల కంటే ఎక్కువ సమయం నిలిచిపోయి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన బిల్డర్లు భవిష్యత్తులో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా నిరోధించాలని సూచించారు.
This website uses cookies.