ప్రీలాంచ్‌లో మోసపోయిన వారి కేసులు ఒక్కొక్కటిగా వెలగులోకి వస్తున్నాయి. కొల్లూరులో కోటీ రూపాయలకే లగ్జరీ విల్లాలంటూ బయ్యర్ల నుంచి అరవై కోట్లు వసూలు చేసి చేతులెత్తేసిన జీఎస్సార్ గ్రూప్ కు చెందిన గుంటుపల్లి శ్రీనివాస్ రావును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు చదలవాడు శ్రీనివాస్ రావు, వేమవరపు సత్యశిల్ప అరెస్టు అయినవారిలో ఉన్నారు. మూడేళ్లలో విల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని లేకపోతే ఇరవై నాలుగు శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తామని మాటిచ్చి విఫలమయ్యాడు.
విల్లాల పేరిట కొనుగోలుదారులకు రూ.15 కోట్ల మేర మోసం చేసిన కేసులో భవిష్య రియల్టర్స్, ఎన్ఎస్ఏ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్లపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2023 జనవరిలో భవిష్య రియల్టర్స్ కు చెందిన పి.బాబూరావు, జె.శేఖర్ రావు, జి.వెంకట రమణారావు, ఎన్ఎస్ఏ అవెన్యూ డైరెక్టర్ కోనేరు వెంకట వినయ్ కలసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గొల్లూరులోని 17 ఎకరాల్లో డూప్లెక్స్ విల్లాలు నిర్మించడానికి ప్లాన్ చేశారు. అశోక్ రావుతోపాటు ఆయన స్నేహితులు 8 మంది అందులో విల్లాలు కొన్నారు. ఒక్కో విల్లా ధర 1.7 కోట్లు. అందరూ అడ్వాన్సుగా రూ.లక్ష చొప్పున చెల్లించారు. 450 చదరపు గజాల స్థలంలో 4,250 స్వ్వేర్ ఫీట్‌లో మూడు సంవత్సరాల్లో నిర్మించి ఇవ్వడానికి అగ్రిమెంట్ కుదిరింది. విడతలవారీగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అందరూ పూర్తి మొత్తం చెల్లించారు. సైట్ కు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని అడిగినప్పుడల్లా..
ధరణి వెబ్ సైట్ ఓపెన్ కావడంలేదంటూ సాకులు చెప్పి తప్పించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతనెలలో అశోక్ రావు తన స్నేహితులతో కలిసి సైట్ ని చూడగానికి వెళ్లగా.. ఆ భూమి బిల్డర్లకు చెందినది కాదని తేలింది. దీంతో మీసేవ కేంద్రంలో ఆ సర్వే నెంబర్ల భూమి గురించి వాకబు చేయగా.. అది నిషేధిత జాబితాలో ఉన్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో బాబూరావు, ఇతర బిల్డర్లపై బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్టు చేశారు.
This website uses cookies.