Categories: TOP STORIES

రాయ‌దుర్గం బ‌దులు.. వేరే ప్రాంతంలో క‌ట్టాలి!

హైద‌రాబాద్లో టీ స్క్వేర్..

న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ త‌ర‌హాలో హైద‌రాబాద్ టీ స్క్వేర్‌ను రాయ‌దుర్గంలో ఏర్పాటు చేయ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. హైద‌రాబాద్‌కే వ‌న్నె తెచ్చే టీ స్వ్కేర్‌ను ర‌ద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేయ‌డం బ‌దులు.. ట్రాఫిక్ ర‌ద్దీ ఏర్పాటు కాని ప్రాంతంలో డెవ‌ల‌ప్ చేయ‌డం స‌రైన నిర్ణ‌యం అవుతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇప్ప‌టికే రాయ‌దుర్గంలో వాహ‌నాల ర‌ద్దీతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దుర్గం చెరువు మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 45కి వెళ్లే మార్గంలో నిత్య‌ర‌ద్దీ క‌నిపిస్తోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు వెళ్లే రోడ్డు..

మాదాపూర్ నుంచి జేఎన్‌టీయూ రోడ్డు.. గ‌చ్చిబౌలి నుంచి మియాపూర్ రోడ్డు.. రాయ‌దుర్గం నుంచి గ‌చ్చిబౌలి రోడ్డు.. ఇలా ఎటువైపు చూసినా.. వాహ‌నాల ర‌ద్దీ గ‌ణ‌నీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో పెరుగుతుందే త‌ప్ప త‌గ్గే ప్ర‌స‌క్తే ఉండ‌దు. కాబ‌ట్టి, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌తో పాటు భ‌విష్య‌త్తులోనూ ట్రాఫిక్ ర‌ద్దీ ఏర్ప‌డ‌ని ప్రాంతాల్లో టీ స్క్వేర్ ను డెవ‌ల‌ప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే, టీ స్వ్కేర్ ఏర్పాటయ్యాక అక్క‌డికి భారీ సంఖ్య‌లో సంద‌ర్శ‌కులు, వాహ‌నాలు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. అలాంట‌ప్పుడు, ట్రాఫిక్ పెరిగి.. దాన్ని ప్ర‌భావం ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని అన్ని ప్రాంతాల‌పై ప‌డుతుంది. దీని వ‌ల్ల అక్క‌డికొచ్చే దేశ‌, విదేశీ ప్ర‌తినిధులకు టీ స్వ్కేర్ పట్ల ప్ర‌తికూల అభిప్రాయం ఏర్ప‌డ‌టానికి ఆస్కారం ఉంటుంది. అందుకే, టీ స్క్వేర్ ను రాయ‌దుర్గం బ‌దులు ఇత‌ర ప్రాంతంలో ఏర్పాటు చేయాల‌ని హైద‌రాబాద్ ప్ర‌జ‌లు కోరుతున్నారు.

This website uses cookies.