Categories: TOP STORIES

రేవంత‌న్నా.. ట్రిపుల్ వ‌న్ జీవో ఏమైంద‌న్నా..?

ట్రిపుల్ వ‌న్ జీవో గురించి స్ప‌ష్ట‌త‌ కోరుతున్న ప్ర‌జ‌లు

ఈ జీవోను ర‌ద్దు చేసిన‌ట్లా? లేక అమ‌ల్లో ఉన్న‌ట్లా?

ట్రిపుల్ వన్ జీవో… సరిగ్గా ఏడాది క్రితం వరకు తెలంగాణలో ఇదో హాట్ టాపిక్‌. సామాన్యుల నుంచి బడా రియల్టర్ల వరకు దీనిపైనే తీవ్రంగా చ‌ర్చించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలివిగా ఏం చేసిందంటే.. ట్రిపుల్ వ‌న్ జీవోలోని ఒక పేరాను తొల‌గించి.. కొత్తగా 69 జీవోను విడుద‌ల చేసింది. ట్రిపుల్ వ‌న్ జీవో ర‌ద్దు అంటూ ప్ర‌చారాన్ని నిర్వ‌హించింది. ల‌క్షా ముప్ప‌య్ రెండు వేల ఎక‌రాల్లో మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేస్తామ‌ని.. గ్రీన్ సిటీగా డెవ‌ల‌ప్ చేస్తామంటూ ర‌క‌ర‌కాల లీకులిచ్చింది. ఎన్నిక‌ల‌య్యాక ట్రిపుల్ వ‌న్ జీవోను పూర్తిగా తొల‌గించాల‌నే ప్లాన్ చేసింది. కానీ, ఆత‌ర్వాత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారాన్ని కోల్పోయింది. కాక‌పోతే, ట్రిపుల్ వ‌న్ జీవును ర‌ద్దు చేయ‌డంపై పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అప్ప‌ట్లో తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ట్రిపుల్ వ‌న్ జీవోను ర‌ద్దు చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌, సోమేష్ కుమార్‌, అర‌వింద్ కుమార్‌ల‌ను.. అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద గుంజ‌కు క‌ట్టేసి.. రాళ్ల‌తో కొట్టాలంటూ ఆవేశంతో ఊగిపోయారు. మ‌రి, అధికారంలోకి వ‌చ్చి ఏడు ఎనిమిది నెల‌లు అవుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్ వ‌న్ జీవో గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏడు నెలల పాలనలో ఒక్కసారంటే ఒక్కసారైనా ట్రిపుల్ వన్ జీవోపై సమీక్ష చేయలేదు. కనీసం ఎక్కడా దాని ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అందుకే ఈ అంశంపై ప్ర‌భుత్వ వైఖ‌రి చెప్పాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

This website uses cookies.