హైదరాబాద్ నిర్మాణ రంగం కుప్పకూలుతుందనో.. ఫ్లాట్ల సంఖ్య పెరిగి ధరలు తగ్గుతాయనో భావించి… కాస్త కన్ఫ్యూజన్లో ఉన్న బయ్యర్లకు.. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో కొనుగోలుదారులకు మంచి క్లారిటీనిచ్చింది. అసలు భాగ్యనగరంలో అమ్మకానికి ఎన్ని ఫ్లాట్లున్నాయి.. వాటిని ఎక్కడెక్కడ కడుతున్నారు? పాతవి ఎన్ని అమ్మకానికి పెట్టారు? కొత్తగా ఆరంభమైనవి ఎన్ని? ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఫ్లాట్లెన్ని తదితర అంశాల్ని.. స్వయంగా దాదాపు యాభై వేల మంది సందర్శకులు వచ్చి తెలుసుకోగలిగారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ కమిషనర్ విచ్చేసి పలు సంస్థలకు బహుమతుల్ని అందజేశారు.
ట్రిపుల్ వన్ జీవో వల్ల ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ 84 గ్రామాలను ఎలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని రచిస్తుందనే విషయం హోమ్ బయ్యర్లకు అర్థమైంది. వచ్చే పది, పదిహేనేళ్లు హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజంగా, ఇది నిర్మాణ రంగానికి ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. దీని వల్ల అటు నిర్మాణ సంస్థలు తమ పనులన్నీ పక్కాగా చేసుకుంటూ ముందుకెళతారు.
మరోవైపు, కొనుగోలుదారులూ తమకు కావాల్సిన ఇళ్లను సులువుగా కొనుగోలు చేసుకునే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి? ఎక్కడెక్కడ ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి? దీని వల్ల ఏయే ఏరియాలు వృద్ధి పథంలోకి పయనిస్తాయనే అంశం గృహ కొనుగోలుదారులకు ఈ ప్రాపర్టీ షో ద్వారా అర్థమైంది.
ప్రాపర్టీ షోలో పాల్గొన్న డెవలపర్లకే కాకుండా.. నిర్మాణ రంగంలో ఉన్న బిల్డరందరికీ.. గిరాకీ ఏర్పడే చోట ప్రాజెక్టుల్ని చేపట్టాలనే విషయం తెలిసొచ్చింది. రానున్న రోజుల్లో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాలేవో అర్థమైంది. కేవలం పశ్చిమ హైదరాబాద్ మీద దృష్టి పెట్టకుండా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న ప్రాంతంలో.. అక్కడి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇళ్లను చేపట్టాలనే విషయం తెలిసింది. వినూత్న సంస్కరణలతో సరికొత్త దిశలో నిర్మాణ రంగం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయం అవగతమైంది.
నిర్మాణ సంస్థల్లో పని చేసే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్లు, పేయింటర్లు, ప్లంబర్లు వంటి వారికి శిక్షణనిచ్చేందుకు ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని అధిక శాతం సంస్థలు స్వాగతించాయి. దీని వల్ల నిర్మాణ రంగానికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకీ ఏర్పాటు చక్కగా పనికొస్తుంది.
This website uses cookies.