Categories: EXCLUSIVE INTERVIEWS

గాలిమేడలు ఇక గాయబ్!

  • ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేస్తే
    ప్రీలాంచ్ డెవ‌ల‌ప‌ర్లు మ‌టాష్‌
  • గాల్లో అమ్మిన‌వారు.. కొన్న‌వారు..
    ఇబ్బంది ప‌డాల్సిందే!
  • 4 ఏళ్ల‌లో 33 జిల్లాల హెడ్ క్వార్ట‌ర్లో
    ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీలు
  • కిస్మ‌త్‌పూర్ విల్లాలు 80 శాతం పూర్తి
  • గిరిధారి క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ ర‌ఘుప‌తిరెడ్డి

ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత వ‌ల్ల ప‌శ్చిమ హైద‌రాబాద్ రియ‌ల్ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం ఉండ‌ద‌ని గిరిధారి క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ ర‌ఘుప‌తిరెడ్డి తెలిపారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో కొత్త ప్రాజెక్టును ఆరంభించిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. ఈ 84 గ్రామాలు న‌గ‌రానికి కాస్త దూరంగా ఉండ‌టం.. ప్ర‌స్తుతం అక్క‌డ త‌క్ష‌ణ‌మే నిర్మాణ ప‌నుల్ని ఆరంభించ‌లేని ప‌రిస్థితి నెలకొనడం.. పైగా ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత మీద కోర్టులేమంటాయో తెలియ‌కుండా ఉండటం వంటి అంశాల కారణంగా.. 69 జీవో అమ‌ల్లోకి రాగానే నిర్మాణ రంగంపై ప్ర‌తికూల ప్రభావం ప‌డుతుంద‌నేది అపోహ మాత్ర‌మేన‌ని వివ‌రించారు. ప్రస్తుత పరిస్థితుల్లో న‌గ‌రాల్లోనే కాదు.. గ్రామాల్లో ఇల్లు క‌ట్టుకున్నా.. నిర్మాణ వ్య‌యం త‌డిసిమోపెడు అవుతుంద‌న్నారు. త‌మ ఊర్లో ఒక వ్య‌క్తి రూ.20 ల‌క్ష‌లు అవుతుంద‌ని ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే.. అది పూర్త‌య్యేస‌రికి రూ.80 ల‌క్ష‌లు అయ్యింద‌ని తెలిపారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరగ‌టం వ‌ల్ల నిర్మాణ సామ‌గ్రి ధ‌ర‌ల‌న్నీ అధిక‌మ‌య్యాయి. స్టీలు, సిమెంట్‌, ఇసుక‌, మెట‌ల్ వంటివి న‌ల‌భై నుంచి యాభై శాతం పెరిగాయి. క‌రోనా త‌ర్వాత కార్మికుల జీత భ‌త్యాలు రెట్టింప‌య్యాయి. దీని వ‌ల్ల ప్రీసేల్‌, యూడీఎస్‌లో ఫ్లాట్ల‌ను అమ్మిన‌వారికి విప‌రీతమైన న‌ష్టం క‌లుగుతుంది. ఎందుకంటే, వీరిలో అధిక శాతం మంది చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.2000 నుంచి రూ.3000కు విక్ర‌యించారు. ఇంచుమించు ఇంతే సొమ్ము నిర్మాణానికీ ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంది. అలాంట‌ప్పుడు భూమి ధ‌ర‌, స్థ‌ల య‌జ‌మాని వాటా కింద నిర్మించాల్సిన ఫ్లాట్లు, నిర్వ‌హ‌ణ రుసుము, ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు చెల్లించాల్సిన ఫీజులు, రుసుములు, మార్కెటింగ్ ఖ‌ర్చులు.. వంటివ‌న్నీ లెక్కిస్తే.. నిర్మాణాల్ని పూర్తి చేయ‌లేని దుస్థితి ఏర్ప‌డుతుంది. కాబ‌ట్టి, 111 జీవోను ఎత్తివేస్తే ప్రీసేల్‌, యూడీఎస్ అమ్మ‌కాల‌కు పూర్తిగా అడ్డుక‌ట్ట ప‌డుతుంది. ఆయా అపార్టుమెంట్ల‌కు అనుమ‌తులు వ‌స్తాయో రావో తెలియ‌దు. గాలిలో అమ్మేశారు. గాలిలో కొనేశారు. ఈ అంశంలో ఇద్ద‌రిదీ త‌ప్పే.

 

ప్ర‌స్తుత ప్రాజెక్టులు..

కిస్మత్ పూర్లో ఆరంభించిన హై ఎండ్ విల్లా ప్రాజెక్టు నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఏడాదిన్నర లోపు కొనుగోలుదారులకు అందజేస్తాం. హైద‌రాబాద్‌తో పాటు ద్వితీయ‌, తృతీయ శ్రేణీ ప‌ట్ట‌ణ‌వాసుల‌కు న‌గ‌రంలో ల‌భించే అత్యాధునిక స‌దుపాయాల్ని అందించాల‌న్న ల‌క్ష్యంతో.. ఆదిలాబాద్ నుంచి అమ‌న్ గ‌ల్ దాకా గేటెడ్ క‌మ్యూనిటీ లేఅవుట్లు, అపార్టుమెంట్లు, విల్లాల్ని క‌ట్టేందుకు అడుగులు ముందుకేస్తున్నాం. ఈ క్రమంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఇప్ప‌టికే అభివృద్ధి చేసిన గేటెడ్ క‌మ్యూనిటీ లేఅవుట్ ప్రాజెక్టులో అపార్టుమెంట్ల‌ను ఆరంభించాం. మొద‌టి విడ‌త‌లో భాగంగా క‌డుతున్న ఫ్లాట్ల‌ను లాంచ్ చేసిన రోజే చదరపు అడుక్కీ రూ.4000 చొప్పున అమ్మేశాం. దీంతో, రెండో ఫేజును ఆరంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఇలా మొత్తం 4 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాల్ని చేపట్టాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.

వికారాబాద్‌లో వీకెండ్ విల్లాలు..

హైద‌రాబాద్ నుంచి వికారాబాద్‌కు సులువుగా రాక‌పోక‌లు సాగించొచ్చ‌నే అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. ఆయా ప్రాంతానికి గ‌ల ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని.. 12 ఎక‌రాల్లో న‌ల‌భై వీకెండ్ హోమ్స్‌ నిర్మిస్తున్నాం. మేం అనుకున్న దానికంటే అధిక ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. 240 గ‌జాల్లో 2000 చ‌ద‌ర‌పు అడుగుల విల్లాను రూ.95 ల‌క్ష‌ల్నుంచి విక్ర‌యిస్తున్నాం. జ‌హీరాబాద్‌లో 10 ఎక‌రాల్లో గేటెడ్ క‌మ్యూనిటీ ప్లాట్ల‌ను ప్ర‌స్తుతం అమ్ముతున్నాం. జ‌డ్చ‌ర్ల‌లోనూ 30 ఎక‌రాల్లో సీజ‌న్స్ టౌన్ ఆరంభించాం. అందులో ఒక అపార్టుమెంట్ క‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ వంటి ప్రాంతాల్లో భూముల్ని సేక‌రించే ప‌నిలో ఉన్నాం.

వ‌చ్చే నాలుగేళ్ల‌లో.. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల హెడ్ క్వార్ట‌ర్ల‌లో గేటెడ్ క‌మ్యూనిటీ ప్లాట్లు, అపార్టుమెంట్లు, విల్లాల్ని నిర్మించాల‌న్న ఉన్న‌త‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఆయా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న‌వారూ.. ఆధునిక స‌దుపాయాలు, సౌక‌ర్యాల్ని ఆస్వాదించాల‌న్నదే మా ఆలోచ‌న‌. వారూ నాణ్య‌మైన జీవనాన్ని అందుకోవాల‌న్న‌దే మా కోరిక‌. అందుకే, కాస్త క్లిష్ట‌మైనా మా ల‌క్ష్యాన్ని చేరుకునే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ముందుకేస్తున్నాం.

This website uses cookies.