Categories: TOP STORIES

గ‌ట్టి మోసానికి.. గాయ‌త్రి ఇన్‌ఫ్రా స్కెచ్‌?

  • బ‌య్య‌ర్ల నుంచి ఏదో ర‌కంగా
    సొమ్ము లాగేయాలి
  • మాయ‌మాట‌లు చెప్పి డ‌బ్బులు
    తీసేసుకోవాలి..

ప్రీలాంచ్‌లో కొంద‌రు అక్ర‌మార్కులు ప్లాట్ల‌ను అమ్మ‌డాన్ని చూశాం.. మ‌రికొంద‌రు ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డాన్ని చూశాం.. ఇంకొంద‌రు వాణిజ్య స‌ముదాయాల్లో పెట్టుబ‌డి పెడితే అద్దె గ్యారెంటీ అంటూ మోస‌పూరిత వాగ్దానాలు చేయ‌డం తెలిసిందే. కానీ, ఓ సంస్థ ప్రీలాంచ్లో భూమిని అమ్మ‌కానికి పెట్టింది. ఇంత‌కీ అది ఏ సంస్థ‌? య‌జ‌మాని ఎవ‌రు? ఇలాంటి మోస‌పూరిత సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగులు.. స్థ‌లాల్ని విక్ర‌యించే ఏజెంట్లు జైల్లో ఊచ‌లు లెక్క పెట్టాల్సి ఉంటుంది. కాబ‌ట్టి, త‌స్మాత్ జాగ్ర‌త్త‌. సాహితీ, జ‌య గ్రూప్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డి పెట్టిన‌వారు ఏం చేయాలో అర్థం కాక త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. వారి సొమ్ము వెన‌క్కి వ‌స్తుంద‌నే గ్యారెంటీ లేక నానా ఇబ్బంది ప‌డుతున్నారు. అలాంటి వారి జాబితాలో మీరు చేర‌కూడ‌దంటే.. గాయ‌త్రి ఇన్‌ఫ్రా వంటి సంస్థ‌ల్లో కొనుగోలు చేయ‌క‌పోవ‌డ‌మే అన్నివిధాల శ్రేయ‌స్కరం. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా.. అధిక శాతం మంది యువ‌కులు రియ‌ల్ ఎస్టేట్ లావాదేవీల‌ను నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా, 2017 త‌ర్వాత ఈ పోక‌డ అధికంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం న‌గ‌ర పంచాయ‌తీల‌ను మున్సిపాలిటీలుగా చేసి.. కొత్త ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాంతాల‌ను ఏర్పాటు చేసి.. మ‌రికొన్ని కార్పొరేష‌న్లు చేయ‌డంతో.. ఒక్క‌సారిగా భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చేశాయి. వెంచ‌ర్ల‌ను వేసే వారి సంఖ్య పెరిగింది. భూలావాదేవీలు అధిక‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో కోర్ హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ముఖ్య ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్ల ధ‌ర‌లు పెరిగాయి.

దీంతో, ఇదే అద‌నుగా భావించిన కొంద‌రు రియ‌ల్ మోస‌గాళ్లు.. ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను అమ్మ‌డాన్ని ఆరంభించారు. ముందే వంద శాతం సొమ్ము బ‌య్య‌ర్ల నుంచి తీసుకునేవారు. ఈ విధానంలో బిల్డ‌ర్ చెప్పిన గ‌డువు ప్ర‌కారం ప్లాటో.. ఫ్లాటో అంద‌జేస్తే ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌దు. కాక‌పోతే, సాహితీ, జ‌య గ్రూప్ వంటి మోసపూరిత బిల్డ‌ర్ల చేతిలో ప‌డితే అంతే సంగ‌తులు. క‌ష్జార్జితం కాస్త బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుంది. కొంత‌కాలం నుంచి రెరా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అక్ర‌మ రియ‌ల్ట‌ర్లు రంగంలోకి దిగారు. మోస‌పూరిత వాగ్దానాల‌తో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను మాయ‌మాట‌లు చెప్పి అమాయ‌కుల‌కు అంట‌గ‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో తాజాగా స‌దాశివ‌పేట్‌లో ఒక రియ‌ల్ట‌ర్ ఏజెంట్ల కోసం స‌రికొత్త స్కీమును ప్ర‌క‌టించారు. అదేమిటంటే..

స‌దాశివ‌పేట్‌లోని గాయ‌త్రి ఇన్‌ఫ్రా య‌జ‌మాని చంద్రశేఖ‌ర్ రెడ్డి ఏజెంట్ల‌ను బుట్ట‌లో వేసుకునేందుకు స‌రికొత్త ఎత్తుగడ వేశారు. ప్రీలాంచ్లో భూమిని అమ్మిపెట్టే ఏజెంట్ల‌ను ఏకంగా దుబాయ్ పంపిస్తానంటూ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఎక‌రా భూమిని అమ్మే ఏజెంట్ల‌కు దుబాయ్ ట్రిప్‌తో పాటు 20 గ్రాముల బంగారం మ‌రియు ఎల్ఐసీ పాల‌సీని అంద‌జేస్తామంటూ ఆశ చూపెడుతున్నారు. రెండు ఎక‌రాలు అమ్మిపెడితే దుబాయ్ ట్రిప్‌తో 40గ్రాముల బంగారం, ప‌ది ఎక‌రాలు అమ్మిస్తే దుబాయ్ ట్రిప్పుతో ఇన్నోవా క్రిస్టాను బ‌హుమ‌తిగా అంద‌జేస్తానంటూ మాయ‌మాట‌లు చెబుతూ.. అమాయ‌కుల‌కు భూమిని అంట‌గ‌డుతున్నాడు. 200 ఎక‌రాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ వెంచ‌ర్‌కు డీటీసీపీ నుంచి కానీ రెరా నుంచి కానీ ఎలాంటి అనుమ‌తి లేదు.
గాయ‌త్రి ఇన్‌ఫ్రా సంస్థ బై బ్యాక్ స్కీమ్ అంటూ మోస‌పూరిత స్కీమును సైతం ప్ర‌క‌టించింది. పాతిక ల‌క్ష‌లు పెట్టి పావు ఎక‌రా కొనుగోలు చేస్తే 15 నెల‌ల్లో సంస్థే 37 ల‌క్ష‌ల‌కు బై బ్యాక్ చేస్తుంద‌ని గాయ‌త్రి ఇన్‌ఫ్రా మోస‌పూరిత వాగ్దానాల‌ను చేస్తున్న‌ది. కాబ‌ట్టి, తెలివైన బ‌య్య‌ర్లు ఇలాంటి మోస‌గాళ్ల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ సంస్థ నిజంగా కొనుగోలుదారుల‌కు మేలు చేయాల‌ని భావిస్తే.. ముందుగా డీటీసీపీ, రెరా అనుమ‌తి తీసుకుని ప్లాట్ల‌ను విక్ర‌యిస్తే ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు.

గాయ‌త్రి ఇన్‌ఫ్రా ఉద్యోగులు త‌స్మాత్ జాగ్ర‌త్త‌..

సాహితీ స్కాంలో ఆయా కంపెనీలో ప‌ని చేసిన ఉద్యోగుల మీద కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. కాబ‌ట్టి, ఇలా ప్రీలాంచ్‌లో అమ్మిన త‌ర్వాత సంస్థ ఆయా వాగ్దానాల్ని నెర‌వేర్చ‌క‌పోతే.. కొన్న‌వారంతా ఉద్యోగులను ప‌ట్టుకుంటారు. అదేవిధంగా, ఏజెంట్లు క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డి.. బంధుమిత్రుల‌కు ఇలాంటి మోస‌పూరిత స్కీముల్లో కొనిపించ‌కండి. త‌మ స్నేహితుల‌కు మేలు చేయాల‌ని భావించే ఏజెంట్లు రెరా అనుమ‌తి పొందిన వెంచ‌ర్ల‌లో కొనిపించ‌డం అన్నివిధాల ఉత్త‌మం.

This website uses cookies.