కింగ్ జాన్సన్ కొయ్యడ: పదిహేనేళ్ల క్రితం ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌లో ఎలాంటి పరిస్థితులుండేవి.. సరిగ్గా అలాంటి పరిస్థితులే ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొన్నాయని.. అలాంటి అనుభవాలు వద్దనుకుంటే.. డెవలపర్లు ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని ఆరంభించకూడదని.. అదేవిధంగా కొనుగోలుదారులు వాటిని కొనకపోవడమే మంచిదని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఏటీఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీఎండీ గీతాంబర్ ఆనంద్ తెలిపారు.
దశాబ్దంన్నర క్రితం ఎన్సీఆర్‌లో రియల్ రంగంలో నెలకొన్న ప్రీలాంచ్ పరిస్థితులు.. కొత్త తరం తప్పటడుగులు.. అనుభవజ్ఞుల ఆలోచనలు.. ఆతర్వాత నెలకొన్న కఠిన పరిస్థితులు.. ఇప్పటికీ తొలగిపోని బాధలు.. కొందరు డెవలపర్లు రోడ్డు మీదికొచ్చేశారు.. మరికొందరు జైలుపాలయ్యారు.. ఇంకొందరు నేటికీ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని వివరించారు. క్రెడాయ్ తెలంగాణ నిర్వహించిన ఈ వెబినార్ ఆసక్తికరంగా సాగింది. మరి, ఆయన ఏమన్నారో.. గీతాంబర్ ఆనంద్ మాటల్లోనే..
సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. కొందరు ఎన్‌సీఆర్ బిల్డర్లు పోటీపడి ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్మారు. ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా అప్పట్లో నిర్మాణ రంగంలోకి విచ్చేశారు. మార్కెట్ రేటు కంటే తక్కువకు ఫ్లాట్లను అమ్మేవారు. ఫలితంగా మొదటి రెండేళ్లు సూపర్ హ్యాపీస్. ఎక్కువ శాతం డెవలపర్లు ఛానల్ పార్టనర్ల మీద ఆధారపడ్డారు. ఊహించినదానికంటే ఎక్కువగా సేల్స్ చేశారు. ఇదే రీతిలో ముందుముందూ కొనసాగుతుందని భావించి.. ఆయా సొమ్మును ఇతర ప్రాజెక్టుల్లోకి మళ్లించడం ఆరంభించారు.
అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ముతో మిగతా నిర్మాణం పూర్తి చేసుకోవచ్చని భావించారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. అనుమతులొచ్చి, నిర్మాణ పనులు ఆరంభయ్యేసరికి అసలు సినిమా ఆరంభమైంది. ప్రీలాంచుల్లో అమ్మినంత సులువు కాదు కదా నిర్మాణాల్ని కట్టడమంటే! నిర్మాణ వ్యయం ఎప్పటికప్పుడు పెరిగిపోవడం చూసి విస్తుపోయారు. నిర్మాణ వ్యయం తడిసిమోపెడు అయ్యేది. ఆతర్వాత రేటు పెంచగానే కొనేందుకు ఎవరూ ముందుకొచ్చేవారు కాదు.. ఈలోపు ప్రీలాంచ్ డెవలపర్ల మధ్య పోటీతత్వమూ పెరిగింది. అమ్మకాల కోసం ఒకరి కంటే మరొకరు రేటు మరింత తగ్గించి.. ఏజెంట్లకు ఎక్కువ కమిషన్లు ఇచ్చేవారు. అదే సమయంలో అప్పటికే అందులో కొన్నవారు.. ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు.
అటు బిల్డర్ల ఫ్లాట్లు ఇటు పెట్టుబడిదారుల ఫ్లాట్ల మధ్య రేటు విషయంలో పోటీ పెరిగింది. ఏదైతేనేం కొనేవారు తగ్గారు. ఫ్లాట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మరికొంతమంది డెలివరీ చేసినా.. కొన్ని నాసిరకంగా ఉండటంతో కొనుగోలుదారులు గగ్గోలు పెట్టారు. ఇక కొందరైతే అసలు ప్రాజెక్టుల్ని ఆరంభించలేదు. వాటికి అనుమతులు రాకపోవడమే ప్రధాన కారణం.
కొన్నాళ్లయినా కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కాలేదు. మరికొన్ని ఆరంభమే కాకపోవడంతో కొనుగోలుదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. బిల్డర్ల మీద కేసులు పెట్టారు. ఫలితంగా, అప్పటివరకూ వారికున్న మంచి పేరు కాస్త పాడైంది. కోర్టులు, జైలు చుట్టూ తిరగడం సర్వసాధారణమైంది. దాన్ని ప్రభావం బిల్డర్ల కుటుంబాల మీద కూడా పడింది. వారిని సమాజం చిన్నచూపు చూడటం ఆరంభమైంది.
కొత్త, పాత అనే తేడా లేకుండా దాదాపు బిల్డర్లందరూ ఇబ్బందుల్లో పడ్డారు. అలాంటి కీలక తరుణంలో కొందరు క్రెడాయ్ సంఘాల సాయం కోరితే.. తగిన సలహాలు, సూచనలిచ్చేందుకు మన పెద్దలు ముందుకొచ్చి నష్టనివారణ ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆతర్వాత సమస్య తీవ్రతను గమనించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం రెరా చట్టానికి రూపకల్పన చేసింది. ఇప్పటికీ కొనుగోలుదారులు కొన్ని ప్రాజెక్టుల్లో సొంతింటి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
దశాబ్దంన్నర క్రితం నెలకొన్న పరిస్థితులే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నాయని తెలిసింది. రానున్న రోజుల్లో నిర్మాణ రంగం ఇబ్బంది పడకూడదంటే కొన్ని నిర్ణయాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా యూడీఎస్, ప్రీలాంచ్ చేసే బిల్డర్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇందుకోసం ముందుగా నిర్మాణ సంఘాల పెద్దల్ని రంగంలోకి దించాలి. వీరు ప్రీలాంచ్ బిల్డర్లతో సంప్రదింపులు జరిపి వారికి అవగాహన కల్పించాలి. క్రెడాయ్ బిల్డర్లతో మళ్లీ క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద సంతకాలు తీసుకోవాలి. ప్రీలాంచ్ బిల్డర్ల పేర్లను పత్రికల్లో ప్రకటించాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కలిసి ఫిర్యాదు చేసి కఠిన చర్యల్ని తీసుకోమని కోరాలి. మొత్తానికి, ప్రీలాంచుల వల్ల కొంతకాలం తాత్కాలిక ఆనందం కలిగినా.. ఆతర్వాత కష్టాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వీటికి అడ్డుకట్ట వేయడమే సరైన నిర్ణయం.
This website uses cookies.