నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభించడంలో విఫలమైనందుకు 28 మంది కొనుగోలుదారులకు వారు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని వాటికా లిమిటెడ్ కు హర్యానా రెరా ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారులు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న పక్షంలో ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని స్పష్టం చేసింది. ‘ప్రాజెక్టును ప్రమోటర్ ప్రారంభించలేనందున కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు పూర్తిగా అర్హులు.
వారు చెల్లించిన తేదీ నుంచి తిరిగి వారికి ఆ మొత్తాన్ని ఇచ్చేవరకు 10.25 శాతం వార్షిక వడ్డీ కూడా చెల్లించాలి’ అని పేర్కొంది. కొంతమంది కొనుగోలుదారులు వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఆ మొత్తాన్ని ప్రమోటర్ కు చెల్లించారని.. అలాంటి సందర్భంలో ఆ మొత్తాన్ని వాటికా సంస్థే ఆయా సంస్థలు, బ్యాంకులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని రెరా సూచించింది. అలా చెల్లించిన తర్వాత కొనుగోలుదారులకు ఏవైనా మొత్తం బకాయి పడితే దానిని కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
గుర్గావ్ సెక్టార్ 88బీలో వాటికా సంస్థ ‘టర్నింగ్ పాయింట్’ పేరుతో 2013లో ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. అనంతరం పలువురు వ్యక్తులకు పలు తేదీల్లో ఒక్కొక్కరికీ ఒక్కో తీరున అమ్మకాలు జరిపింది. ప్రాజెక్టు పూర్తిచేసి, అప్పగించడానికి 2025 సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా నిర్దేశించింది. అయితే, ప్రాజెక్టు ప్రారంభించి నాలుగేళ్లయినా అక్కడ చిన్నపాటి తవ్వకాలు మినహా ఎలాంటి పనులూ చేయలేదు. దీంతో బాధితుల ఫిర్యాదుతో రెరా ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
This website uses cookies.