ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ దక్షిణ భారతదేశంలోని టైర్-2 నగరాల్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. బెంగళూరు కాకుండా మైసూర్, మంగళూరు, హోసూరు వంటి దక్షిణ భారతదేశంలోని టైర్-2 పట్టణాల్లో కూడా ప్లాట్లను అభివృద్ధి చేయడానికి చూస్తున్నామని గోద్రేజ్ ప్రాపర్టీస్ సౌత్ సీఈఓ ప్రమోద్ బిష్త్ వెల్లడించారు. టైర్-2 నగరాల్లో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 30వేల కోట్లతో 21.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులు ప్రారంభించి.. 15 మిలియన్ చదరపు అడుగుల మేర నిర్మాణాలను పూర్తి చేసి డెలివరీ చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ‘దక్షిణ భారతదేశంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది స్థిరమైన మార్కెట్.
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే బలమైన, తుది వినియోగదారుల డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతం’ అని బిష్త్ పేర్కొన్నారు. గోద్రెజ్ ప్రాపర్టీస్ బెంగళూరు, చెన్నైల్లో బలమైన పాదముద్ర కలిగి ఉండగా.. 2024లో హైదరాబాద్ లో ప్రవేశించింది. దాదాపు రూ.3500 కోట్ల ఆదాయ లక్ష్యంతో రాజేంద్ర నగర్ లో 12.5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అనంతరం కోకాపేటలో మూడు ఎకరాలు తీసుకుంది. ‘ప్రస్తుతం హైదరాబాద్లోని ఈ రెండు ప్రాజెక్టుల నుంచి ప్రీమియం, లగ్జరీ లాంచ్ లు చేయాలని చేయాలని చూస్తున్నట్టు బిష్త్ వెల్లడించారు.