గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ లో తన లీజును పునరుద్ధరించుకుంది. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కు సంబంధించిన లీజును రూ.37.03 కోట్ల వార్షిక అద్దెతో మూడేళ్ల కాలానికి పునరుద్ధరించింది. ఈ సంస్థ నానక్ రామ్ గూడలోని మీనాక్షి టెక్నోవా భవనంలోని మొదటి, రెండు, మూడు, ఎనిమిది, తొమ్మది అంతస్తుల్లో మొత్తం 2,91,708 చదరపు అడుగుల స్పేస్ ను లీజుకు తీసుకుంది. అలాగే గ్రౌండ్, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, పది అంతస్తుల్లోని 2,91,708 చదరపు అడుగుల స్పేస్ ను కూడా తీసుకుంది. ఇందుకోసం రూ.28 కోట్లు డిపాజిట్ చెల్లించినట్టు పత్రాలన బట్టి తెలుస్తోంది.
చదరపు అడుగుకు రూ.52.90 చొప్పున లీజును 2022 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు పునరుద్ధరించుకుంది. దీంతో కంపెనీ లీజుకు తీసుకున్న మొత్తం ప్రాంతం 5,83,416.75 చదరపు అడుగులకు చేరుకుంది. అక్టోబర్ లో డీసీ డెవలప్ మెంట్ నోయిడా లిమిటెడ్.. గూగుల్ కంపెనీ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు దాదాపు 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రూ.10.9 కోట్ల ప్రారంభ నెలవారీ అద్దెతో పదేళ్ల కాలానిక సబ్ లీజుకు ఇచ్చింది. నోయిడాలోని సెక్టార్ 62లో ఉన్న అదానీ డేటా సెంటర్లో గూగుల్ ఈ స్థలాన్ని లీజుకు తీసుకుంది.