గత కొద్ది రోజుల్నుంచి.. తెలంగాణ రాష్ట్రమంతటా ఇదే చర్చ జరుగుతోంది. సబ్ కమిటీ భూముల విలువల్ని పెంచాలన్న నివేదిక అందజేసిన తర్వాత.. సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కొందరైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏడున్నర శాతం అవుతాయని జోస్యం పలికారు. కాకపోతే, ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతకీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయా? లేవా? ఒకవేళ పెంచాలని నిర్ణయిస్తే.. ఎప్పట్నుంచి పెంచుతారు?
భూముల మార్కెట్ విలువల పెంపుదల.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంపై.. ఒక భిన్నమైన వాదన వినిపిస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా ఇష్టం లేదని తెలిసింది. అందుకే, గత ఏడేళ్ల నుంచి భూముల విలువల్ని పెంచలేదని అధికారులు అంటున్నారు. కాకపోతే, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్లో రియల్ రంగానికి ఎక్కడ్లేని గిరాకీ ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ భూముల్ని కొనేవారు పెరిగారు.
విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు చెందిన ప్రవాసుల్లో కొందరు హైదరాబాద్లోనే ఫ్లాట్లు, విల్లాల్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతిన్నది. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా పెద్దగా భూముల మార్కెట్ విలువల్ని పెంచకూడదని నిర్ణయించింది. కాకపోతే, ఏడేళ్ల నుంచి పెంచకపోవడంతో.. మార్కెట్ విలువకు, ప్రభుత్వ విలువల మధ్య భారీ తేడా ఏర్పడింది. దీంతో, ఈ విలువల్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం కొంత శాతం మాత్రమే విలువల్ని పెంచేలా నిర్ణయించేందుకు అంగీకరించారని సమాచారం.
జీహెచ్ఎంసీ పరిధిలో అయితే గజం రూ.2 వేలున్న చోట రూ.3 వేలు చేస్తారట. రూ.10వేల నుంచి 20 వేలు ధర ఉన్న చోట.. 40 శాతం పెంచుతారని తెలిసింది. రూ.20 వేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో 30 శాతం, హెచ్ఎండీఏ పరిధిలో 30 నుంచి 50 శాతం పెంచుతారని సమాచారం. ఇండ్ల మార్కెట్ విలువను 20 నుంచి 30 శాతం పెంచుతారని తెలిసింది. ఇప్పటివరకూ ఆరు శాతమున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఏడు శాతం చేసే అవకాశం ఉందని సమాచారం. మరి, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.