Categories: LATEST UPDATES

హౌసింగ్ బోర్డు భూములపై సర్కారు నజర్

    • వేలం వేయడానికి సన్నద్ధం

హైదరాబాద్ లో భూముల అమ్మకం ద్వారా గణనీయమైన ఆదాయం పొందుతున్న తెలంగాణ ప్రభుత్వం కన్ను తాజాగా హౌసింగ్ బోర్డు భూములపై పడింది. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు చెందిన భూములను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని కూకట్ పల్లి, పోచారం, రావిర్యాలతోపాటు వెంగళరావు నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించింది. మొత్తమ్మీద 540 ఎకరాల భూములు ఉన్నట్టు లెక్క తేలిందని సమాచారం. ఆ భూములను వేలం వేయడానికి వీలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ)కి అప్పగించాలని హౌసింగ్ బోర్డుకు సూచించినట్టు తెలుస్తోంది.

ఈ భూముల అమ్మకం ద్వారా రూ.2 వేల కోట్ల నుంచి రూ.3వేల కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2021-22లో ఇప్పటివరకు కోకాపేట, ఖానామెట్, ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడల్లో భూముల వేలం ద్వారా దాదాపు రూ.3వేల కోట్ల ఆదాయం పొందినట్టు తెలిపాయి. ‘కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు భూములను వేలం వేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో హెచ్ఎండీఏకి అనుభవం ఉన్నందున వాటిని ఆ సంస్థకు అప్పగించాలనే సూచనలు వస్తున్నాయి. ఈ భూముల వేలంపై బోర్డుకు ఎలాంటి అధికారం లేనందున, దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని హౌసింగ్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కూకట్ పల్లిలో ఉన్న 32 ఎకరాలను త్వరలోనే హెచ్ఎండీఏకు అప్పగించే అవకాశం ఉంది. వాణిజ్యం, బహుళ అవసరాల నిమిత్తం ఎకరం, ఎకరంన్నర విస్తీర్ణంలో పెద్ద ప్లాట్లు కూడా వేస్తారని సమాచారం. లేఅవుట్ అభివృద్ధి చేసిన తర్వాతే వేలానికి వెళతారని అధికారులు వెల్లడించారు. ఈ భూములు హైటెక్ సిటీకి దగ్గర్లో ఉండటం, నగరంలోని మెట్రో, ఇతర రవాణా వ్యవస్థలకు చక్కని కనెక్టివిటీ కలిగి ఉన్న నేపథ్యంలో చదరపు గజానికి కనీస ధర రూ.1.50వేలుగా నిర్ధారించే అవకాశం ఉందని అంచనా.

This website uses cookies.