అసమర్థ, లోపభూయిష్ట మరియు రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ని చూస్తే విస్మయమేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలేమిటి? ఈ అధికారులు చేస్తున్నదేమిటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు తమ భూముల వివరాలను సులువుగా పొందాలి. నయా పైసా లంచం ఇవ్వకుండా పట్టా తీసుకోవాలి. రైతులు రాజుల్లా తమ డాక్యుమెంట్లను తీసుకోవాలన్నదే కదా సీఎం ముఖ్య ఉద్దేశ్యం. మరి, ఆయన ఆలోచనలకు విరుద్ధంగా.. రైతులకు శాపంగా మారే విధంగా ఈ ధరణి పోర్టల్‌ని ఎందుకు రూపొందించింది? గత కొంతకాలం నుంచి తెలంగాణ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వాటిని పరిష్కరించకుండా.. ఈ ఉన్నతాధికారులు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ధరణి పోర్టల్లో ఎదురయ్యే సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపెట్టడం లేదు?
తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాస్ బుక్స్ చట్టం 2020 ప్రకారం ఈ ధరణి పోర్టల్‌ని రూపొందించారు. కానీ, ఈ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి ధరణిని రూపొందించారని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే, ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని అన్ని భూములపై హక్కుల రికార్డును నిర్దేశించిన విధంగా మరియు పద్ధతిలో కేంద్రీకృత నిల్వలో డిజిటల్‌గా తయారు చేసి నిర్వహించాలి. అంతేకాదు, భూములకు పట్టాదారులుగా ఉన్న వ్యక్తులందరి పేర్లు, ప్రతి పట్టాదార్ సర్వే నంబర్లు మరియు విస్తీర్ణాలు, నిర్దేశించబడిన ఇతర వివరాలు వంటివి హక్కుల రికార్డు కింద పొందుపర్చి ఉండాలి. కానీ, ఇవేవీ ధరణిలో నమోదు చేయలేదు.
భూమి స్వభావం, యాజమాన్య స్వభావం మొదలైన వాటితో సంబంధం లేకుండా అన్ని గ్రామాల్లోని అన్ని భూముల రికార్డును ధరణి తప్పనిసరిగా కలిగి ఉండాలని చట్టం చెబుతున్నా ధరణిలో ఆ ప్రాథమిక నిబంధనను పూర్తిగా తుంగలో తొక్కారు. ఫలితంగా లక్షల ఎకరాల భూమి ధరణి పోర్టల్‌లోకి ఎక్కలేదు. అసలు కొన్ని సర్వే నెంబర్లు ధరణిలో కనిపించడం లేదు. ఉదాహరణకు, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారా నగర్ గ్రామంలో 1 నుంచి 63 వరకు 63 సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ గ్రామంలో మొత్తం భూమి సుమారు 700 ఎకరాలు కాగా ధరణిలో దాదాపు 15 సర్వే నంబర్లు నమోదు కాలేదు. ఎంచుకున్న కొంతమంది వ్యక్తుల పాక్షిక విస్తీర్ణాలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. మొత్తం 700 ఎకరాల్లో కేవలం 200 ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదై ఉంది. అంటే, దాదాపు ఐదు వందల ఎకరాలు ధరణిలో నమోదు కాలేదు. అంటే, ఆ చట్టం యొక్క ప్రాథమిక నిబంధనను ఉల్లంఘించినట్లే కదా! ప్రతి గ్రామంలో భూముల్ని నమోదు చేయకుండా ఏం చేస్తున్నారు?
పట్టేదార్లుగా ఉన్న వ్యక్తులందరి పేర్లు ధరణిలో నమోదు కాలేదు. ప్రతి పట్టాదారు యొక్క సర్వే నంబర్లు మరియు విస్తరణలు కూడా నమోదు చేయలేదు. ఒక సర్వే నంబర్‌లో మొత్తం 10 ఎకరాలుంటే అందులో కొంత భాగాన్ని మాత్రమే తెలుగు అక్షరాల ప్రత్యాయాలతో నమోదు చేశారు. అది కూడా కేవలం కొందరు వ్యక్తులవి మాత్రమే నమోదయ్యాయి. దీనివల్ల ధరణిలో పేర్లు లేదా సర్వే నంబర్లు నమోదు కాని /చూపని వ్యక్తులు చాలా సందర్భాలలో తమ భూములపై తమకున్న హక్కుల్ని వినియోగించుకోలేకపోతున్నారు.
తక్షణమే ఇలా చేయాలి..
ధరణి పోర్టల్లో ప్రతి ఒక్క అంశాన్ని అశాస్త్రీయంగా, చట్టవిరుద్ధంగా తీర్చిదిద్దారు. ఇది నేరుగా ఆర్‌వోఆర్ చట్టం 2020ని ఉల్లంఘిస్తోంది. ఈ ప్రాథమిక అంశాన్ని ఉపసంఘం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి, ఉపసంఘం తక్షణమే ఏం చేయాలంటే.. కొత్త ఆర్‌వోఆర్ చట్టంలోని సెక్షన్ 3లోని నిబంధనల్ని అనుసరించాలి. ఎందుకంటే, 1971 చట్టం ప్రకారమే ఆర్‌వోఆర్ రూపొందించారు. దాన్ని ఆధారంగా ప్రస్తుతం కొత్త చట్టాన్ని సిద్ధం చేశారు. అలాంటప్పుడు, 1971 చట్టం ప్రకారం తయారు చేసిన అన్ని భౌతిక ఎంట్రీలు మరియు ఎలక్ట్రానిక్ ఎంట్రీలను మొదట ధరణి పోర్టల్‌లోకి ఒకేలా తీసుకు వచ్చేలా కసరత్తు జరగాలి. ఇంకా ఏం చేయాలంటే..
ప్రతి మండలంలో అనుభవజ్ఞులైన సిబ్బంది కలిగిన బృందాన్ని నియమించి భౌతిక మరియు ఎలక్ట్రానిక్ రూపంలో ఎంట్రీలను సేకరించాలి.
అది పూర్తయిన తర్వాత, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లేదా ఎమ్మార్వోల వద్ద జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. ప్రజలు తమ పత్రాలను కార్డు కింద తీసుకునేలా చేయాలి.
కార్డు విధానం గత పదేళ్ల నుంచి అమల్లో ఉంది. రెవెన్యూ చట్టాన్ని, వ్యవసాయ శాఖకు సంబంధించిన పరిజ్ఞానం లేని కొందరు అనుభవరాహిత్యులైన యువకులు తెలిసీతెలియక చేసిన లోపభూయిష్టమైన వ్యవస్థను తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉండదు.
మొదట భౌతికంగా మరియు తరువాత ఎలక్ట్రానిక్ ఎంట్రీల మధ్య సయోధ్య కలిగే వ్యవస్థ ఏర్పడాలి.
బంధుప్రీతి మరియు అవినీతి కారణాలతో ధరణి పోర్టల్‌ను సిద్ధం చేయడానికి మరియు నిర్వహించడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కనిపించే మోసపూరిత అసమర్థ ఏజెన్సీని ఒకేసారి తొలగించాలి. ఈ పనిని ప్రజా ఉపయోగమైన కంప్యూటర్ పరిజ్ఞానం తయారీ, నిర్వహణలో అనుభవంతో పాటు శక్తి సామర్థ్యం గల టీసీఎస్ వంటి నైపుణ్యం ఉండి.. తమ పనితనం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థకు మాత్రమే అప్పగించాలి. అసమర్థుల చేతిలో పెట్టి లక్షలాది అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదు. జాతీయ భద్రతకు సంబంధించిన పాస్‌పోర్ట్‌ల నిర్వహణ ఈ సంస్థే చేస్తుందనే విషయం మర్చిపోవద్దు.
ఆస్తి హక్కు ఉల్లంఘన (బాక్స్)
చట్టం ప్రకారం, ధరణిలో వివరాలన్నింటినీ నమోదు చేయకుండా ఉండే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కలెక్టర్ లేదా ఎమ్మార్వో వంటి ఏ అధికారికి లేదు! నమోదు చేయబడిన వివరాల యొక్క ఖచ్చితత్వం లేదా వేరే విషయం పూర్తిగా వేరే విషయం. రికార్డింగ్ చేయని చర్య చాలా తీవ్రమైనది మరియు ప్రమాదకరమైనది.”రూల్ ఆఫ్ లా” అనే గొప్ప సూత్రానికి అవమానం. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300లో పొందుపరిచిన ఆస్తి హక్కును ఉల్లంఘిస్తుంది.