తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పట్నుంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని డీటీసీపీ ప్రాంతీయ సంచాలకులు కొమ్ము విద్యాధర్ తెలిపారు. ఇటీవల మాదాపూర్‌లోని ఐజీబీసీ నిర్వహించిన గ్రీన్ క్రూసెడ్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెయ్యి చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో కట్టే వాణిజ్య సముదాయాల్లో సోలార్ వాటర్ హీటింగ్ మరియు లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తే ఆస్తి పన్నులో పది శాతం తగ్గింపునిస్తామని వెల్లడించారు.
మురుగు జలాల్ని శుద్ధి చేయడంతో పాటు వాన నీటిని సంరక్షిస్తే పది శాతం రిబేటును కల్పిస్తామని తెలిపారు.
ప్రతి పట్టణ ప్రాంతాన్ని హరితమయం చేయడానికి మున్సిపల్ బడ్జెట్లో పది శాతం సొమ్మును గ్రీనరీ కోసం కేటాయిస్తూ చట్టం చేసిన ఘనత మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఐజీబీసీ నుంచి గ్రీన్ సర్టిఫికెట్లను అందుకున్న 35 సంస్థలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాన్ని హరితమయం చేసేందుకు అవసరమయ్యే నిర్ణయాల్ని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.
టీఎస్ఐఐసీ వైస్ ఛైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఐటీ భవనాలు, నివాస సముదాయాలన్నీ హరిత సూత్రాలకు అనుగుణంగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈవీ వాహనాలు, రాయదుర్గం స్కై వాక్ ఏర్పాటు వంటి అనేక నిర్ణయాలు గ్రీనరీని పెంపొందించేందుకు దోహదం పడుతుందన్నారు. 2014లో 24 శాతమున్న గ్రీనరీని 33 శాతానికి పెంపొందించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రస్తుతమున్న నిర్మాణాలు ఐజీబీసీ గోల్డ్ రేటింగును అందుకునేందుకు దృష్టి సారించాలన్నారు.
దేశంలోనే ప్రప్రథమంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్లాటినం రేటింగును అందజేసిన సీఐఐ ఐజీబీసీకి దక్షిణ మధ్య రైల్వై డివిజనల్ మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసినట్లుగానే రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు రైల్వే విభాగం దృష్టి సారిస్తుందన్నారు. ఐజీబీసీ పాలసీ కమిటీ ఛైర్మన్ వి. సురేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ తమ వద్ద 40 మెట్రో స్టేషన్లు, 65 రైల్వే స్టేషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. 21 లక్షల గృహాలు గ్రీన్ హోమ్స్, అఫర్డబుల్ హౌసింగ్, గ్రీన్ రెసిడెన్షియల్ సొసైటీ విభాగం కింద నమోదు అయ్యాయని తెలిపారు.
ప్రస్తుతం సుమారు 35 సంస్థలు 5.5 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని ఐజీబీసీలో నమోదు చేశారు. వీరంతా తమ నిర్మాణాల్ని హరిత సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తారు. ఈ క్రమంలో భాగంగా.. మాదాపూర్‌లోని ఐజీబీసీలో ఐజీబీసీ గ్రీన్ క్రూసేడర్స్ అనే కార్యక్రమం ఇటీవల జరిగింది. ఇందులో పాల్గొన్న బిల్డర్లు, డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలను ఐజీబీసీ ప్రత్యేకంగా ప్రొత్సహించింది.
ప్రభుత్వం రాష్ట్రాన్ని హరితమయం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధిని చేపట్టేందుకు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. క్రమం తప్పకుండా నిర్వహించే హరితహారమే ఇందుకు చక్కటి నిదర్శనం. సదుపాయాలన్నీ హరితమయం చేయాలని నిర్ణయం తీసుకున్న టీఎస్ఐఐసీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దేశంలోనే ప్రప్రథమంగా ప్లాటినం రేటింగును అందుకున్న ఘనత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు దక్కుతుంది. దీన్ని సాధ్యం చేసిన దక్కన్ రైల్వే బృందానికి ధన్యవాదాలు. మొత్తానికి, తెలంగాణలో అనేక మంది బిల్డర్లు, డెవలపర్లు గ్రీన్ రేటింగ్ సర్టిఫికెట్‌ను తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. మరింత మంది డెవలపర్లు ముందుకొచ్చి.. ప్రతి నిర్మాణాన్ని హరితమయం చేసుకోవాలి. – సి.శేఖర్‌రెడ్డి, ఛైర్మన్, ఐజీబీసీ- హైదరాబాద్
This website uses cookies.