Categories: LATEST UPDATES

కో-వ‌ర్కింగ్ స్థ‌లానికి పెరుగుతున్న గిరాకీ!

హైద‌రాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ రంగాల‌తో పాటు కో-వ‌ర్కింగ్ స్పేస్‌కు గిరాకీ గ‌ణ‌నీయంగా పెరిగింది. వీటికి రానున్న రోజుల్లో మ‌రింత డిమాండ్ పెరుగుతుంద‌ని సిరిల్ సంస్థ తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. జెడ్ఎఫ్ ఫినీక్స్‌, లెగాటో, పీడ‌బ్ల్యూసీ, ఐడీఎఫ్‌సీ, ఐస్ప్రౌట్‌, గోల్డ్‌మ‌న్ సాచ్స్‌, ఎల్‌టీఐ, గెయిన్ సైట్‌, హెచ్ అండ్ ఆర్‌, బ్లూ జే వంటి సంస్థ‌లు న‌గ‌రంలోని వివిధ ఐటీ స‌ముదాయాల్లో స్థ‌లాన్ని తీసుకున్నాయి. మొత్తానికి, 2022 ప్ర‌థ‌మార్థంలో సుమారు 52 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల వాణిజ్య స్థ‌లాన్ని వివిధ సంస్థ‌లు లీజుకు తీసుకోవ‌డం విశేషం. ప్యాండ‌మిక్ కంటే ముందున్న స్థాయి కంటే అధిక స్థ‌లాన్ని కంపెనీలు తీసుకోవ‌డం విశేషం.

ఐటీ రంగానికి అధిక డిమాండ్ ఉండ‌గా, ఆర్థిక సేవ‌లు మ‌రియు ఇంజినీరింగ్ లీజింగ్ త‌యారీ రంగాలు ఇర‌వై మ‌రియు ప‌ది శాతం వాటా క‌లిగి ఉండ‌టం విశేషం. కో వ‌ర్కింగ్ ఆప‌రేటర్లు సుమారు ప‌దిహేను శాతం వాటాను సొంతం చేసుకున్నారు. మాదాపూర్‌, గ‌చ్చిబౌలిలో డిమాండ్ అధికంగా న‌మోదైంది. 2022 ప్ర‌థ‌మార్థంలో సుమారు 95 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల గ్రేడ్‌-ఏ ఆఫీసు స్థ‌లాన్ని ప‌లు సంస్థ‌లు లీజుకు తీసుకున్నాయి. వీటి అద్దె కూడా మైక్రో మార్కెట్‌లో స్థిరంగా ఉండ‌టం విశేషం. మాదాపూర్ వంటి ప్రాంతంలో గ్రేడ్ ఏ స్థ‌లం లేక‌పోవ‌డంతో ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు అద్దెల‌ను పెంచేశారు. 2023 లోపు గ‌చ్చిబౌలిలో సుమారు కోటీ ప‌ది ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల వాణిజ్య స‌ముదాయం అందుబాటులోకి వ‌స్తుంది.

హైద‌రాబాద్ రిటైల్ మార్కెట్ విష‌యానికి వ‌స్తే.. 2022 ప్ర‌థ‌మార్థంలో సుమారు ఆరు ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని మాత్ర‌మే వివిధ బ్రాండ్లు తీసుకున్నాయి. షాపింగ్ మాళ్ల‌లో వివిధ కంపెనీలు 20 శాతం స్థ‌లాన్ని తీసుకోగా.. వాణిజ్య రోడ్ల‌లో ఉన్న షాపింగ్ స‌ముదాయాల్లో 60 శాతం బ్రాండ్లు ఎంచుకోవ‌డం విశేషం. దుస్తులు, రెడీమేడ్ గ్యార్మెంట్స్ వంటివి 45 శాతం స్థ‌లం తీసుకున్నాయి. వెస్ట్ సైడ్‌, మ్యాక్స్‌, స్ట‌యిల్ యూనియ‌న్‌, జూడియోస్ వంటివి 2022 ప్ర‌థ‌మార్థంలో అధిక స్థ‌లాన్ని తీసుకున్నాయి.
2021లో ఏడు ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం కొత్త‌గా రిటైల్ రంగంలోకి చేరింది. దాదాపు ప‌ది ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని ప‌లు షాపింగ్ మాళ్లు 2022లో ఆరంభిస్తున్నాయి. మైక్రో మార్కెట్లో అద్దె స్థిరంగా ఉండ‌గా.. మాదాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, బంజారాహిల్స్‌, కొండాపూర్‌, హిమాయ‌త్ న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో రిటైల్ సముదాయాల అద్దెలు గ‌ణ‌నీయంగా పెరిగాయి.

This website uses cookies.