Categories: TOP STORIES

వామ్మో.. విల్లాకు సొమ్ము క‌డితే అక్క‌డ స్థ‌ల‌మే లేదు.. ఏం మాయ‌గాళ్లు రా బాబు!

  • జీఎస్సార్ గ్రూప్ ప్రీలాంచ్ ద‌గా
  • విల్లాలు కట్టిస్తామని చెప్పి కోట్లలో వసూలు
  • విల్లా కాదు.. అస‌లు స్థ‌ల‌మే లేదు!
  • ఆల‌స్యంగా గుర్తించిన బాధితులు
  • ఆఫీసు చుట్టూ చ‌క్క‌ర్లు..
G Srinivas Rao, MD- GSR Group

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. మోసాలు మాత్రం ఆగడంలేదు. ప్రీ లాంచ్ దగాలతోపాటు లిటిగేషన్ భూముల అమ్మకాల వంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జీఎస్ఆర్ ప్రీ లాంచ్ మోసం ఒకటి బయట పడింది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఈ సంస్థ‌పై నెల రోజుల క్రితం రామ‌చంద్రాపురం పోలీసు స్టేష‌న్‌లో కేసు ఫైల్ అయినా డెవ‌ల‌ప‌ర్ మీద ఎలాంటి చ‌ర్య‌లు లేవు. తాజాగా, మ‌రికొంత‌మంది బాధితులు ఈ సంస్థ కార్యాల‌యానికి చేరుకుని.. త‌మ సొమ్మును వెన‌క్కి ఇవ్వ‌మ‌ని సంస్థ‌ను నిల‌దీశారు. కాక‌పోతే, జీఎస్సార్ గ్రూప్ ఎండీ జి.శ్రీనివాస్ రావు త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ని వీరంతా అంటున్నారు.

మోకిలలో విల్లాలు కట్టిస్తామని చెప్పి పలువురి నుంచి రూ. కోట్లలో వసూలు చేసిన ఈ సంస్థ.. ఏళ్లు గడుస్తున్నా ఒప్పందం ప్రకారం విల్లా అప్పగించకుండా కొనుగోలుదారులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఒక్కో విల్లాలకు రూ.1.05 కోట్లు చెల్లించిన కొనుగోలుదారులు చెప్పులు అరిగేలా జీఎస్ఆర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడంలేదు. 2021 నవంబర్ లో చెల్లింపులు చేశామని, 2023 డిసెంబర్ నాటికి విల్లా అప్పగించాల్సి ఉందని.. కానీ ఆ దిశగా ఏ పనీ జరగడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మోకిలలో విల్లా ప్లాట్ చూపించారని.. కానీ అక్కడ వెంచర్ రద్దు అయిందని చెప్పి కొల్లూరులో హై రైజ్ అపార్ట్ మెంట్ చూపించారని ఓ కొనుగోలుదారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు హైరైజ్ అపార్ట్ మెంట్ వద్దని, విల్లానే కావాలని పట్టుబట్టడంతో వేరే ప్లేస్ చూపించి.. ఈ ఏడాది మార్చిలో 500 చదరపు గజాలు త‌మ‌ పేరున రిజిస్ట్రేషన్ చేసి 2025 మార్చి నాటికి విల్లా పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చరాని వివరించారు. కానీ ఆ హామీ ఇచ్చి మూడు నెలలు దాటుతున్నా ఇదిగో, అదిగో తిప్పుతున్నారని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. చివరకు వారిచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని.. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని హెచ్చరించగా.. వారం రోజుల్లో మొత్తం సెటిల్ చేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ టెన్షన్ల కారణంగా తనకు గుండెపోటు వచ్చి నాలుగు స్టెంట్లు కూడా పడ్డాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

This website uses cookies.