రియల్ రంగంలో అమ్మకాలను ప్రోత్సహించడానికి నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలపై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని రియల్టీ నిపుణులు, డెవలపర్లు కోరుతున్నారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజులతోపాటు కొనుగోలుదారులు జీఎస్టీ కూడా చెల్లించాల్సి రావడంతో అమ్మకాలపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల కొనుగోలుకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల చాలామంది కొనుగోలుదారులు రెడీ టూ మూవ్ ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. అంతేకాకుండా రెడీ టూ మూవ్ ప్రాపర్టీల కొనుగోలులో రిస్కు కూడా ఉండదు. అందువల్ల డెవలపర్లు అమ్మకాలను వేగవంతం చేయడానికి ప్రాపర్టీ నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారికి డబ్బు అవసరం. అదే సమయంలో పెరిగిన ఇన్ పుట్ వ్యయం, రుణాలపై వడ్డీ వంటివి ప్రాపర్టీ ధరకు జోడించక తప్పదు. ఇది కొనుగోలుదారులు పరోక్షంగా చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ఆస్తులపై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
జీఎస్టీ విధించడం వల్ల ప్రాజెక్టు, ప్లాట్లపై అమ్మకం మరింత ఖరీదైంది. గతంలో రాయితీ ఉండటం వల్ల ఖర్చు తక్కువగా ఉండేదని.. కానీ ఇప్పుడు రాయితీ లేకపోవడం వల్ల ఖర్చు పెరిగి కస్టమర్లపై భారం పడుతోందని అంటున్నారు. అలాగే జీఎస్టీని తిరిగి ఇచ్చేలా చేసి, ఇన్ పుట్ పై క్రెడిట్ ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఇన్ పుట్, నిర్మాణ వ్యయాలు పెరగడమే కాకుండా జీఎస్టీ రూపంలో అదనంగా ప్రాజెక్టుపై భారం పడుతోందని డెవలపర్లు చెబుతున్నారు. తాము సగటున 15 నుంచి 18 శాతం చెల్లిస్తున్న నిర్మాణ వ్యయానికి సంబంధించి ఎలాంటి ఇన్ పుట్ క్రెడిట్ పొందడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో విక్రయాలపై 5 శాతానికి పైగా విధిస్తున్న జీఎస్టీని తిరిగి పొందే విధానం ఉండాలని కోరుతున్నారు.
This website uses cookies.