Categories: LATEST UPDATES

స్టక్చరల్ ఆడిట్ సమర్పిస్తేనే ఓసీ

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) కావాలంటే బిల్డర్లు తప్పనిసరిగా స్టక్చరల్ ఆడిట్ రిపోర్టు సమర్పించాల్సిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వ అథార్టీ నియమించిన సంస్థ ద్వారానే ఈ స్టక్చరల్ ఆడిట్ చేయించాల్సి ఉంటుంది. కొత్త, జాప్యం జరిగిన ప్రాజెక్టులన్నింటికీ ఇది వర్తించనుంది. ఈ ఆడిట్ నివేదికను బట్టే ఓసీ జారీ చేయనున్నారు. ఈ మేరకు నోయిడా అథార్టీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని విధాలుగా ఆ నిర్మాణం సురక్షితమేనని స్టక్చరల్ ఆడిట్ నివేదిక ఉంటేనే డెవలపర్ కు ఓసీ ఇస్తామని పేర్కొంది. ఇప్పటికే ఉన్న భవనాల విషయంలో అయితే, ఆ భవనంలో ఉంటున్నవారిలో కనీసం 25 శాతం మంది స్టక్చరల్ ఆడిట్ నివేదికకు అంగీకరించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆయా భవనాల్లో ఏమైనా మైనర్ లేదా మేజర్ లోటుపాట్లు ఉంటే వాటిని నోయిడా అథార్టీకి దృష్టికి తీసుకురావాలని.. దానిపై యంత్రాంగం తగిన చర్యలు తీసుకుని పరిష్కరిస్తుందని నోయిడా అథార్టీ సీనియర్ మేనేజర్ దేవేంద్ర నిగమ్ వెల్లడించారు. ఇక ఓసీ తీసుకున్న తర్వాత తదుపరి ఐదేళ్ల పాటు స్టక్చరల్ ఆడిట్ కు బిల్డర్ దే జవాబుదారీ. ఈ కాలంలో వచ్చే ఎలాంటి లోపాలనైనా అతడే పరిష్కరించాల్సి ఉంటుంది. స్టక్చరల్ ఆడిట్ కోసం ఐఐటీ కాన్పూర్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ, అహ్మదాబాద్ లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ లోని మాలవీయ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లను నోయిడా అథార్టీ ఎంపిక చేసింది.

మన పరిస్థితి ఏంటి?
స్టక్చరల్ ఆడిట్ కు సంబంధించి నోయిడా అథార్టీ చక్కని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో హైదాబాద్ లో పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తలెత్తక మానదు. అసలు మన దగ్గర ఇలాంటి వ్యవస్థ ఉందా? అసలే ఎక్కడికక్కడే భారీ ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. మరి వాటి స్టక్చర్ ఎలా ఉంది? బిల్డర్లు అలాంటి పెద్ద పెద్ద భవనాలను నాణ్యతతోనే నిర్మిస్తున్నాడా? ఈ విషయాలను తేల్చేదెవరు? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

This website uses cookies.