Categories: TOP STORIES

లైఫ్ సైన్సెస్ అడ్డాగా హైద‌రాబాద్‌!

బెంగళూరు, ఢిల్లీ తర్వాత భాగ్యనగరమే
నాలుగేళ్లలో 1.6 మిలియన్ చ. అ. ఆఫీస్ స్పేస్ లీజింగ్

లైఫ్ సైన్సెస్ సంస్థల ప్రాధాన్య నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానం సంపాదించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ విడుదల చేసిన ‘లైఫ్ సైన్సెస్ ఇన్ ఇండియా: ది సెక్టార్ ఆఫ్ టుమారో’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. లైఫ్ సైన్సెస్ కంపెనీల ఆఫీస్ స్పేస్, ఆక్యుపెన్సీ ట్రెండ్ లతోపాటు దేశంలో కొత్త క్లస్టర్ల ఆవిర్భావాన్ని ఇందులో వివరించారు. హైదరాబాద్ లోని లైఫ్ సైన్సెస్ సంస్థలు 2019-22 మధ్య 1.6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం.

పాన్ ఇండియా ప్రాతిపదిక చూస్తే ఈ కాలంలో లైఫ్ సైన్సెస్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్ లో హైదరాబాద్ 19 శాతం వాటా నమోదు చేసింది. ఇక్కడ పెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్లు, గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాలు, నాణ్యమైన ఆర్అండ్ డీ ల్యాబ్ లు, ఇంకుబ్యేషన్ సెంటర్లు, పరిశోధనా స్థలాలు ఉండటమే దీనికి కారణం. హైదరాబాద్ లో లైఫ్ సైన్సెస్ సంస్థల ఆఫీస్ లీజింగ్ 2019లో 0.3 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. 2020లో కరోనా నేపథ్యంలో 0.1 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. మళ్లీ 2021, 2022 సంవత్సరాల్లో 0.6 మిలియన్ చదరపు అడుగుల చొప్పున నమోదైంది. తద్వారా ఈ నాలుగేళ్లలో మొత్తం 1.6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ ఉపరంగాలు గత నాలుగేళ్లలో లైఫ్ సైన్సెస్ సంస్థల ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో అగ్రగామిగా ఉన్నాయి. 50వేల చదరపు అడుగుల లోపు లావాదేవీలు 57 శాతం ఉండటం గమనార్హం. జీనోమ్ వ్యాలీలో రూ.1800 కోట్లతో మూడు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించనున్నట్టు ప్రకటించిన బయెలాజిక్-ఇ హైదరాబాద్ లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోన్నట్టు నివేదిక వెల్లడించింది. ఇక పాన్ ఇండియా ప్రాతిపదికన చూస్తే.. 2019-22 మధ్య కాలంలో దేశంలోని మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో అమెరికా లైఫ్ సైన్సెస్ సంస్థలు 56 శాతం వాటాతో అగ్రభాగంలో ఉండగా.. తర్వాత యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా కంపెనీలు 24 శాతం, దేశీయ కంపెనీలు 19 శాతం, ఏపీఏసీ సంస్థల ఒక శాతం వాటా కలిగి ఉన్నాయి.

తెలంగాణ అగ్ర‌స్థానం

2019-22 మధ్య కాలంలో బెంగళూరు, ఢిల్లీల్లో హెల్త్ కేర్, మెడికల్ డివైసెస్ లు ప్రముఖ ఉప రంగాలుగా ఉన్నాయి. అయితే, హైదరాబాద్, చెన్నై, ముంబైల్లో మాత్రం ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఆఫీస్ స్పేస్ టేకప్ కు ప్రాధాన్యత ఇచ్చాయి. 2019 నాటికి గుజరాత్ లో అత్యధిక సంఖ్యలో డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ సర్టిఫైడ్ ఫార్మా తయారీ ప్లాంట్లు ఉండగా.. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఉత్తరాఖండ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లు కూడా ప్రధాన తయారీ కేంద్రాలుగా ఉన్నాయని వివరించింది. అత్యధిక సంఖ్యలో యూఎస్-ఎఫ్ డీఏ సర్టిఫైడ్ ప్లాంట్లతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా.. మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, కర్ణాటక, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా ఇవి బాగానే ఉన్నాయి. ఇక సాధారణ తయారీలో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా.. అనాలసిస్, ఏపీఐ తయారీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

వచ్చే మూడేళ్లలో లైఫ్ సైన్సెస్ ఇలా
అంతర్జాతీయ, దేశీయ డెవలపర్ల ఎంట్రీ, విస్తరణ ద్వారా కొత్త సరఫరా వస్తుందని అంచనా. అలాగే బల్క్ డ్రగ్ పార్కులు, మెడికల్ డివైజ్ పార్కులు, ఫార్మాసిటీలు మొదలైన అత్యుత్తమ శ్రేణి ఆర్ అండ్ డీ సౌకర్యాలతో క్లస్టర్ డెవలప్ మెంట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

 

రాబోయే త్రైమాసికాల్లో ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైజ్, హెల్త్ కేర్ సంస్థల నేతృత్వంలో స్పేస్ టేకప్ పెరిగే అవకాశం ఉంది. ఎంపిక చేసిన కంపెనీలు కూడా ప్లెక్స్ స్థలాలను తీసుకోవాలని యోచిస్తున్నాయి. ప్లగ్ అండ్ ప్లే ఫీచర్లు, ఈఎస్ జీ ప్రమాణాలతో బీటీఎస్ డెవలప్ మెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.లైఫ్ సైన్సెస్ రంగాల డిమాండ్ ను బట్టి అద్దె వృద్ధి ఆధారపడి ఉంటుంది 2023లో ద్రవ్యోబల్బణం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో నిర్మాణ వ్యయం స్వల్పంగా మాత్రమే పెరుగుతుంది.

This website uses cookies.