ఆస్తి విక్రయ ఒప్పందం పేరుతో ఓ వ్యక్తిని రూ.2.33 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. ఢిల్లీలోని మధు విహార్ కు చెందిన గుజరా కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ 52 ఏళ్ల శ్రవణ్ కుమార్ చౌదరి ఆస్తి ఒప్పందం పేరుతో నోయిడా నివాసి సుశీల్ కుమార్ ని మోసం చేశాడు. నోయిడా అథారిటీకి చెందిన రూ.9 కోట్ల ఆస్తిని బాధితుడికి విక్రయించేందుకు మోసపూరిత పత్రాలు సృష్టించాడు. నోయిడా సెక్టార్ 5 కింద హరోలాలో ఏడు అంతస్తుల వాణిజ్య సముదాయం ఉందని.. అందులో సగం రూ.9.5 కోట్లకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు.
దీంతో సుశీల్ కుమార్ ఆ ప్రాపర్టీని కొనాలని నిర్ణయం తీసుకుని రెండు గతేడాది నవంబర్ 25న ఒప్పందం చేసుకున్నారు. అనంతరం విడతలుగా రూ.2.33 కోట్లు చెల్లించారు. అయితే, ఆ పత్రాలు సరైనవి కావని, తాను మోసపోయానని గుర్తించిన సుశీల్ కుమార్.. తన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని శ్రవణ్ కుమార్ ను అడిగారు. దీంతో శ్రవణ్ బెదిరించడంతో సుశీల్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న శ్రవణ్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో లండన్ నుంచి వచ్చిన శ్రవణ్ ను ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
This website uses cookies.